- సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం,వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. శుక్రవారం కమిషనరేట్‌లో కాన్ఫరెన్స్ హాల్‌లో కరీంనగర్ రూరల్, హుజూరాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో సీపీ రివ్యూ నిర్వహించారు. ఎన్నికల బందోబస్తు ప్రణాళిక అమలుపై స్టేషన్ హౌస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ రూరల్, హుజూరాబాద్ డివిజన్లలోని 15 పీఎస్ పరిధిలో పోలింగ్ కేంద్రాలకు అనుగుణంగా విభజించామన్నారు. ఇద్దరు ఏసీపీలు,4 ఇన్‌స్పెక్టర్లు, 25 మంది ఎస్సైలు ఎన్నికల బందోబస్త్‌ను పర్యవేక్షిస్తారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు శ్రీనివాస్ జి , వేణుగోపాల్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి
కోరుట్ల,వెలుగు: శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. శుక్రవారం మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ శాంతియుత వాతావరణంలో సాగేందుకు భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. ఎస్పీ వెంట సీఐలు అనిల్ కుమార్, సురేశ్, ఎస్ఐలు కిరణ్‌కుమార్, అనిల్, శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది
ఉన్నారు.
మంథని, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి అన్నారు. శుక్రవారం మంథని మండలం గోపాల్‌పూర్, రచ్చపల్లి, చిన్న ఓదాల గ్రామాల్లో ఎన్నికల నియమావళిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రమేశ్, సీఐ రాజు గౌడ్, ఎస్సైలు రమేశ్, సాగర్ పాల్గొన్నారు.
