
- హనుమకొండ జిల్లాలో పెరుగుతున్న జ్వర బాధితులు
- జులైలో 16, ఆగస్టులో 15 డెంగ్యూ కేసులు నమోదు
- వ్యాధులు ప్రబలకుండా యాక్షన్ తీసుకుంటున్న ఆఫీసర్లు
- ఆశాలు, ఏఎన్ఎంలతో ఇంటింటి సర్వే
- హై రిస్క్ ఏరియాల్లో మెడికల్ క్యాంపులు
హనుమకొండ, వెలుగు: జిల్లాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దోమలు ముప్పేట దాడి చేస్తుండటంతో డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. జ్వర బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. జ్వర బాధితులను గుర్తించి మెడిసిన్ అందజేయడం, తీవ్రతను బట్టి మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేస్తున్నారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రై డే పాటించాల్సిందిగా అవగాహన కల్పిస్తున్నారు.
నెలన్నరలో 31 డెంగ్యూ కేసులు..
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణ పరిస్థితులు, దోమల ప్రభావంతో గ్రామాల్లో విష జ్వరాలు ఎక్కువవుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. హనుమకొండ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు ఒక మలేరియా, 48 డెంగ్యూ పాజిటివ్ కేసులు రాగా, అందులో నెలన్నర రోజుల్లోనే 31 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జులైలో 16 డెంగ్యూ పాజిటివ్ కేసులు వస్తే, ఈ నెలలో గడిచిన 15 రోజుల్లోనే 15 డెంగ్యూ కేసులు బయటపడటం గమనార్హం. వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు ఏడు మలేరియా, 54 డెంగ్యూ పాజిటివ్ కేసులు వచ్చాయి.
ఇంటింటా ఫీవర్ సర్వే..
సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో వైద్యారోగ్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాధుల నియంత్రణ ఉమ్మడి వరంగల్ స్పెషల్ ఆఫీసర్ డా.వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఇప్పటికే వేర్వేరుగా అధికారులతో సమావేశమయ్యారు. వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆఫీసర్లకు ఆదేశాలిచ్చారు. దీంతో అధికారులు ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 18 హై రిస్క్ ఏరియాలను గుర్తించి, దాదాపు 4,907 మందికి పరీక్షలు చేశారు.
ఫీవర్ లక్షణాలున్న వారికి మెడిసిన్ అందజేశారు. ఇంటింటి సర్వే బాధ్యతను ఆశాలు, ఏఎన్ఎంలకు అప్పగించి, పెద్దాఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రోజు 25 ఇండ్ల చొప్పున ఆశాలు, ఏఎన్ఎంలు సర్వే చేపట్టి, వివరాలు సేకరిస్తుండగా, డీఎంహెచ్వో అప్పయ్య, ఇతర ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 15 వరకు నిర్వహించిన జ్వర సర్వేలో మొత్తంగా 462 మందికి ఫీవర్ లక్షణాలు బయ టపడగా, వారికి మెడిసిన్ అందజేశారు. జిల్లాలో ప్రస్తుతం 179 మంది జ్వరం లక్షణాలతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఫీవర్ సర్వే నిర్వహించి, మెడికల్ క్యాంపులు పెడుతున్నం. గ్రేటర్ పరిధిలోని స్లమ్ ఏరియాలతోపాటు ముంపు ప్రాంతాలపై ఫోకస్ పెట్టాం. ప్రజలు జ్వరాల బారిన పడకుండా దోమతెరలు వాడాలి. పరిసరాల్లో దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- డా.ఏ.అప్పయ్య, డీఎంహెచ్వో, హనుమకొండ
రిస్క్ ఏరియాల్లో మెడికల్ క్యాంపులు..
ఇంటింటి సర్వేలో భాగంగా కమలాపూర్, వేలేరు మండలం చింతలతండా, నడికూడ మండలం రాయపర్తి, గ్రేటర్ సిటీలో శాయంపేట, జీఎంహెచ్ ఏరియాల్లో జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఆయా పీహెచ్సీల పరిధిలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. సిటీ పరిధిలోని స్లమ్ ఏరియాలు, లోతట్టు ప్రాంతాల్లోనూ సర్వే నిర్వహించి, జ్వర బాధితులకు మందులు అందజేశారు. డెంగ్యూ పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రతి మంగళ, శుక్ర వారాల్లో డ్రై డే నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధులపై జనాలకు అవగాహన కల్పిస్తున్నారు.