కాళేశ్వరం కమిషన్ను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందనే అనుమానం ఉంది: హరీశ్ రావు

కాళేశ్వరం కమిషన్ను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందనే అనుమానం ఉంది: హరీశ్ రావు

కాళేశ్వరం కమిషన్ ను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందనే అనుమానం ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం (జులై 11) కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ తో  సమావేశం అయిన ఆయన.. అదనపు సమాచారాన్ని  కమిషన్ కు అందించినట్లు తెలిపారు. 

కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా చీఫ్ సెక్రటరీ, GAD సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీలకు సమాచారం కోసం లేఖ రాసినట్లు చెప్పారు హరీశ్ రావు. అయితే వాళ్ళ నుంచి సమాచారం రాలేదని.. దీంతో తమ దగ్గరదగ్గర ఉన్న సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. 

 కాళేశ్వరం ప్రాజెక్టు కు ఆరు సార్లు క్యాబినెట్, మూడు సార్లు శాసనసభ అప్రూవల్ ఉందని.. ఆ వివరాలను కమిషన్ చైర్మన్ కు డాక్యుమెంట్ ల రూపంలో అందించినట్లు చెప్పారు. ఇంతకుమించిన వివరాలు కూడా ఉన్నా.. ప్రభుత్వం పూర్తి సమాచారం కమిషన్ కు ఇచ్చిందా.. ఏమైనా దాచారా అన్నది తెలియాల్సి ఉందని అన్నారు.

ఈ విషయంలో కమిషన్ కు పూర్తి వివరాలు ఇస్తున్నారా అన్న అనుమానం తమకు ఉన్నట్లు చెప్పారు హరీశ్ రావు. కమిషన్ తప్పుదోవ పట్టేలా వాళ్లకు అనుకూలంగా ఉండే సమాచారం మాత్రమే ఇస్తున్నారేమో అనే అనుమానం ఉందని అన్నారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాటు చేసిన ద్రోహాలను ppt రూపంలో కమిషన్ కు ఇచ్చినట్లుగా తమకు అనిపించిందని చెప్పారు. అదే విధంగా కాళేశ్వరంపై సీఎం రేవంత్ గురువారం (జులై 10) మాట్లాడినదంతా అబద్ధమని చెప్పిన హరీష్.. అబద్ధాన్ని నిజం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.