మందాడి సత్యనారాయణరెడ్డికి దత్తాత్రేయ నివాళి

మందాడి సత్యనారాయణరెడ్డికి దత్తాత్రేయ నివాళి

హనుమకొండ: ప్రజల ఆశయాల కోసం పాటుపడిన వ్యక్తి మందాడి సత్యనారాయణరెడ్డి అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన కన్నుమూశారన్న వార్త దుఃఖ సాగరంలో ముంచెత్తిందన్నారు. హన్మకొండ జిల్లా ఎక్సైజ్ కాలనీలో జరిగిన మందాడి సంస్మరణ సభకు గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. మందాడి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన బండారు దత్తాత్రేయ.. తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు 50 సంవత్సరాలు నిస్వార్థ సేవలు అందించిన మందాడి భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన సేవలు చిరస్మరణీయం అన్నారు. రచయితగా, కవిగా, గాయకుడిగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం సేవలందించారని గుర్తు చేశారు. ఏ విషయంలోనైనా చాలా లోతుగా తెలుసుకుని.. విశ్లేషించేవారని అన్నారు.

విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ లో చేరిన మందాడి తర్వాత భారతీయ జనసంఘ్ లో ఫుల్ టైమ్ నిర్వాహకుడిగా పనిచేశారని.. జనసంఘ్ ఏర్పాటైన కొత్తలో ఎన్నో కవితలు, పద్యాలు రాసి పాడి అందరి మన్ననలను అందుకున్నారని గవర్నర్ దత్తాత్రేయ వివరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.