ఎదో బంగారం దొరుకుతుందని వెతుకుతూ వెళితే ఓ వ్యక్తికి అదృష్టం ఒక్కసారిగా పట్టేసింది. ఈ రోజుల్లో ఏళ్ల తరబడి వెతికిన దొరకని బంగారు నిధి.. అతనికి మాత్రం అనుకోకుండా ఊహించనంత దొరికింది. ఆస్ట్రేలియాలోని ఓ మారుమూల ప్రాంతంలో దొరికిన ఈ భారీ బంగారు ముద్ద విలువ సుమారు 1.5 లక్షల నుంచి 1.6 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.90 లక్షల నుంచి రూ.1 కోటి పై వరకు ఉండొచ్చు.
అసలు ఈ బంగారం ఎక్కడ దొరికింది?
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో టిబూబుర్రా సమీపంలోని మౌంట్ స్టువర్ట్ స్టేషన్ ప్రాంతంలో ఈ అరుదైన బంగారు ముద్ద బయటపడింది. తన పేరు బయటకు చెప్పడానికి ఇష్టపడని ఓ బంగారు అన్వేషకుడుకి ఈ బంగారు ముద్ద దొరికింది.
కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో బంగారం కోసం వెతుకుతున్న అతనికి మొదట పెద్దగా ఏమీ దొరకలేదు. ఎక్కడ తవ్వినా పాత మేకులు, సీసపు తూటాలు, గుర్రపునాడలు వంటి పనికిరాని వస్తువులే ఎదురయ్యేవి. అయినా అతను ప్రయత్నం ఆపలేదు. అదే చివరికి అతని అదృష్టాన్ని మార్చేసింది!
మట్టిలో మెరిసిన బంగారం!
బంగారం కోసం వెతుకుతున్న సమయంలో అతని మెటల్ డిటెక్టర్ ఓ సిగ్నల్ ఇచ్చింది. మొదట అది మామూలు వస్తువే అయి ఉంటుందని భావించినా, కొద్దికొద్దిగా తవ్వుతున్న కొద్దీ డిటెక్టర్ శబ్దం పెరుగుతూ వచ్చింది. సుమారు 100 మిల్లీమీటర్ల లోతు వరకు తవ్వేసరికి డిటెక్టర్ గట్టిగా శబ్దం చేయడం మొదలుపెట్టింది.
అంతే.. అతను మట్టిని మరింత జాగ్రత్తగా తొలగించగా, గుంత మధ్యలో ఓ చిన్న పసుపు రంగు మెరుపు కనిపించింది. మొదటిసారి చూసిన ఆ మెరుపే అతనికి బంగారు నిధిని పరిచయం చేసింది!
భూమిలోంచి ఆ ముద్దను బయటకు తీసినప్పుడు అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ అరుదైన క్షణాన్ని వీడియోలో కూడా రికార్డ్ చేశారు. బంగారు ముద్దను చేతిలోకి తీసుకుంటూ, “ఇదిగో చూడండి! నేను నమ్మలేకపోతున్నాను!” అంటూ అతను సంబరపడిపోయాడు.
బంగారు ముద్ద విలువ ఎంతంటే?
ఈ బంగారు ముద్దకు ‘టిబూబుర్రా స్పడ్’ అనే పేరు పెట్టారు. దీని మొత్తం బరువు సుమారు 1.2 కిలోలు. ఇందులో క్వార్ట్జ్ అనే ఖనిజం కూడా ఉంది. పరీక్షల ప్రకారం, ఈ ముద్దలో సుమారు 940 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉన్నట్లు తేలింది.
దీని మార్కెట్ విలువ సుమారు 1.5 లక్షల నుంచి 1.6 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అయితే, ఇలాంటి అరుదైన బంగారు ముద్దలపై ఆసక్తి ఉన్న కొందరు ఎక్కువ ధర చెల్లించడానికి ముందుకొస్తే, దీని అమ్మకం విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. దీన్ని కనుగొన్న వ్యక్తి కూడా విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.
దొరకడం చాలా అరుదు!
బ్రోకెన్ హిల్‌లో బంగారం వెతికే పరికరాలను విక్రయించే గ్రెగ్ స్పాంగ్లర్ ప్రకారం, కిలో కంటే ఎక్కువ బరువున్న బంగారు ముద్దలు దొరకడం చాలా అరుదు. అయినసరే, సరదా కోసం బంగారం వెతికే వారి సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపారు. సాధారణంగా బంగారం కోసం వెతికేవారికి ఎక్కువగా పాత లోహపు ముక్కలు, పనికిరాని వస్తువులే దొరుకుతాయి. కానీ ఒక్కోసారి ఇలాంటి అద్భుతమైన విచిత్రాలు కూడా ఎదురవుతాయి.
రోజుల తరబడి శ్రమ.. ఎన్నో నిరాశలు.. చివరికి చేతిలో లక్షల విలువైన బంగారం. టిబూబుర్రా స్పడ్ కథ ఇప్పుడు బంగారం కోసం అన్వేషించే వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే, ఇలాంటి అదృష్టం ప్రతిసారీ దక్కుతుందని మాత్రం చెప్పలేం!
‘GOLD!’: prospector unearths nugget worth $150,000 The ‘Tibooburra Spud’ weighs more than a kilogram (2.5 lb) and it has been discovered by a Broken Hill prospector in outback NSW https://t.co/et6fyKdXVn
— RT (@RT_com) October 27, 2026
