రాష్ట్రమంతా వానలు.. ఉరుస్తున్నడబుల్ బెడ్రూం ఇళ్లు

రాష్ట్రమంతా వానలు.. ఉరుస్తున్నడబుల్ బెడ్రూం ఇళ్లు
  • ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్​లో భారీ వర్షాలు 
  • పాలమూరు, సిద్దిపేట, కరీంనగర్​టౌన్లలో ఇండ్లలోకి నీళ్లు
  • జలదిగ్బంధంలో బండరావిపాకుల
  • సిద్దిపేటలో ఉరుస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు  
  • ఇయ్యాల రేపు కూడా వానలు

వెలుగు, నెట్​వర్క్: రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పదిరోజులుగా చినుకు లేక దిక్కులు చూస్తున్న రైతులకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో పత్తి, మక్క, కందిలాంటి మెట్ట పంటలకు ప్రాణం లేచొచ్చినట్లయింది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా పడుతున్న వానలకు మహబూబ్​నగర్, సిద్దిపేట, కరీంనగర్​టౌన్లలో కాలనీల్లోకి భారీగా నీళ్లు చేరడంతో జనం ఇబ్బందులుపడ్డారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పాలమూరు టౌన్​లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. మహబూబ్​నగర్, నాగర్​ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దుందుభి వాగులో వరద ఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల పూర్తిగా నిండడంతో దిగువకు18 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ద్వారా భీమా, నెట్టెంపాడు, కోయిల్​సాగర్​లిఫ్టు స్కీముల కింద సాగునీటిని రిలీజ్ చేశారు. ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామం బండరావిపాకులను వరదలు చుట్టుముట్టాయి. శని, ఆది వారాల్లో కురిసిన భారీ వర్షాలకు 30 కుటుంబాలు ఉంటున్న తాత్కాలిక పునరావాస కేంద్రం జలదిగ్బంధం అయింది. పక్కనే 33/ 11 కేవీ సబ్ స్టేషన్ ఉండడంతో వీరు కాలు బయటపెట్టలేకుపోతున్నారు.   రాష్ట్రవ్యాప్తంగా సోమవారం, మంగళవారం ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

డబుల్ ఇండ్ల స్లాబులు లీక్ 

ఉమ్మడి మెదక్ లోనూ భారీ వర్షాలు పడ్డాయి. సిద్దిపేటతో పాటు కొమురవెల్లి, చేర్యాల, కోహెడ, తొగుట, గజ్వేల్, నంగునూరు, అక్కన్నపేట మండలాల్లో భారీ వర్షం కారణంగా పలు చోట్ల కరెంట్ కట్ అయింది. సిద్దిపేటలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు మునిగాయి. పలు చోట్ల ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. వానలకు సిద్దిపేట కేసీఆర్ నగర్ లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల స్లాబులు ఉరిశాయి. క్వాలిటీ లేనందుకే స్లాబుల నుంచి వాన నీళ్లు లీక్ అవుతున్నాయని ఇండ్ల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మంలో చిరుజల్లులు 

ఖమ్మం సిటీతో పాటు సత్తుపల్లి, పెనుబల్లి, కారేపల్లి, తల్లాడ, కల్లూరులో చిరు జల్లులు పడ్డాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వాన ఆదివారం సాయంత్రం వరకు పడుతూనే ఉంది. సూర్యాపేట పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. 

కరీంనగర్ లో కాలనీలు జలమయం

వర్షాలకు కరీంనగర్ సిటీలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. చెట్లు కూలిపోయి రాకపోకలు ఆగిపోయాయి. స్టేడియం సమీపంలో స్మార్ట్  సిటీ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న డ్రైన్ పూర్తి కాకపోవడంతో వరద నీరంతా బయటకు వచ్చింది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ఇంట్లో సామాన్లు, బియ్యం, వస్తువులు తడిసిపోయాయి. సిరిసిల్ల, జగిత్యాల, మెట్​పల్లిలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.