తుఫాన్​ ఎఫెక్ట్​తో ఇయ్యాల తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో భారీ వర్షాలు

తుఫాన్​ ఎఫెక్ట్​తో ఇయ్యాల తమిళనాడు, పుదుచ్చేరి,  ఏపీలో భారీ వర్షాలు

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్‌ తుఫాన్ చెన్నైకి ఆగ్నేయంగా 260 కి.మీ, తూర్పు-ఈశాన్య దిశగా 180 కి.మీల దూరంలో  కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోందని చెప్పింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఏపీ తీరం మీదుగా పుదుచ్చేరి – శ్రీహరికోట మధ్య శుక్రవారం అర్ధరాత్రి తీరం దాటుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో గరిష్ఠంగా 65 నుంచి -85 కి.మీ స్పీడ్​తో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

రెవెన్యూ డిపార్ట్​మెంట్​తో పాటు డిజాస్టర్​ మేనేజ్​మెంట్​టీంలను అలర్ట్​ చేసింది. తమిళనాడు ప్రభుత్వం కూడా అలర్ట్​ అయింది. సీఎస్​వి ఇరాయ్ అన్బు సీనియర్ ఆఫీసర్లతో సమావేశమై తుఫాన్​ ఎఫెక్ట్​పై సమీక్షించారు. పుదుచ్చేరి, కారైక్కాల్‌లో శనివారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. సబర్బన్ సర్వీసులతో సహా కొన్ని రైళ్లు నడిచాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. పుదుచ్చేరి సీఎం ఎన్​ రంగస్వామి కూడా రెవెన్యూ, డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు.