- బాధితులకు పరిహారం వివరాలు సమర్పించండి: హైకోర్టు
- సిగాచీ ప్రమాదంపై పిటిషన్లో ప్రభుత్వానికి ఆదేశం
దరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడుకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తు పురోగతిపై సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఈ సంఘటనపై విచారణ కోసం ఏర్పాటు చేసిన ఎక్స్‌పర్ట్ కమిటీ సమర్పించిన రిపోర్టును కూడా అందజేయాలంది. మృతుల కుటుంబాలకు, గాయపడ్డ వారికి ప్రకటించిన వాటితోపాటు చట్టబద్ధంగా అందాల్సిన పరిహారంలో ఎంతెంత మొత్తం చెల్లించారో బాధితుల వారీగా జాబితా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
సిగాచీ ఫ్యాక్టరీ యాజమాన్యానికి సైతం నోటీసులు జారీ చేస్తూ కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. సిగాచీ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడుపై దర్యాప్తులో జాప్యం జరుగుతున్నదని, దర్యాప్తును సిట్‌కు అప్పగించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన కె.బాబూరావు హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధానాగరాజ్ వాదనలు వినిపిస్తూ.. రియాక్టర్ పేలుడులో 54 మంది మృతి చెందగా, 8 కనిపించలేదని, 28 మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు.
ఈ సంఘటన జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా దర్యాప్తులో తీవ్రజాప్యం జరుగుతున్నదన్నారు. ఇప్పటివరకు బాధ్యులను గుర్తించి అరెస్ట్ చేయలేదని తెలిపారు. అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు కొనసాగుతున్నదని, ఇప్పటివరకు 192 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించినట్లు తెలిపారు. ప్రమాదంలో కంపెనీ ఉపాధ్యక్షుడు కూడా మృతి చెందారని, ఫ్యాక్టరీ నిర్వాహకులు దర్యాప్తుకు సహకరిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతానికి మరణించిన కుటుంబానికి రూ.40 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. అదే అదృశ్యమైనవారికి రూ.25 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం పరిహారం వివరాలతోపాటు నిపుణుల కమిటీ సిఫార్సులతో సహా దర్యాప్తు పురోగతిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
