
- హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ గ్రామంలోని ఓ నిర్మాణాన్ని కూల్చొద్దని గతంలో తాము ఆదేశించినా.. ఎందుకు కూల్చారో చెప్పాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. 200 చదరపు గజాల్లోని 480 చదరపు అడుగుల నిర్మాణం జోలికి వెళ్లొద్దన్న ఆదేశాలను ఉల్లంఘించి తన ఇంటిని కూల్చేశారంటూ వి.తార అనే మహిళకోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.
దీనిపై స్పందించిన జస్టిస్ కె.లక్ష్మణ్.. పిటిషనర్ నిర్మాణాన్ని ఎందుకు కూల్చారో వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. సున్నం చెరువు పరిధిలో ఇల్లు ఉందని, రెవెన్యూ శాఖతో కలిసి సర్వే చేయించి చర్యలు తీసుకుంటామని హైడ్రా గతంలో చెప్పిందని పిటిషనర్ లాయర్ తెలిపారు.
సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టు ఆదేశించినప్పటికీ.. గత నెల 30న ఆ ఇల్లును కూల్చేశారని వెల్లడించారు. పిటిషనర్‌ను అరెస్టు చేసి, ఇంటిని కూల్చివేశారని తెలిపారు. సుమారు 70 మంది పోలీసులు తెల్లవారుజామున 4 గంటల సమయంలో వచ్చి పిటిషనర్‌తో పాటు కుటుంబసభ్యులను ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపి కూల్చివేతలు చేపట్టారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వివరణ ఇవ్వాలని హైడ్రాను ఆదేశిస్తూ.. విచారణను ఆగస్టు 22కి కోర్టు వాయిదా వేసింది.