
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ రికార్డుల్లో 57 ఏండ్ల తర్వాత పేరు మార్చాలని కోరడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పేరు మార్పుకు నిర్ధిష్ట గడువు అనేది చట్టంలో లేకపోయినప్పటికీ సుదీర్ఘకాలం తర్వాత ఇలాంటి వ్యవహారాలపై ఉత్తర్వులు జారీ చేయరాదని సుప్రీంకోర్టు కూడా చెప్పినట్లు గుర్తు చేసింది.
ఈ వివాదాన్ని సంబంధిత సివిల్ కోర్టులో తేల్చుకోవాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సమర్థించింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలోని భూవివాదంపై సాగి హనుమంతరావు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసింది. బూరుగుపల్లిలో పిటిషనర్ తల్లి 64.30 ఎకరాలను కొనుగోలు చేశారు.
అయితే, 5.19 ఎకరాలకు సంబంధించి పహాణి స్వాధీనదారు పద్దులో ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఈ భూమిని రెవెన్యూ పద్దుల్లో సవరించాలంటూ 2019లో అప్లికేషన్ పెట్టుకుంటే దానిని ఎమ్మార్వో స్పెషల్ రెవెన్యూ ట్రైబ్యునల్‌కు పంపారు. ఇది ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల సివిల్ వివాదమని ట్రైబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చింది.
దీనిని హనుమంతరావు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై సింగిల్ జడ్జి కూడా సివిల్ కోర్టులో తేల్చుకోవాలని తీర్పు చెప్పారు. ఈ తీర్పును రద్దు చేయాలంటూ హనుమంతరావు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై.. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాస్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారణ పూర్తి చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ అప్పీలును కొట్టివేసింది.