గోల్డెన్మైల్లో ఎకరా రూ.77.75 కోట్లు

గోల్డెన్మైల్లో ఎకరా రూ.77.75 కోట్లు
  • హెచ్​ఎండీఏకు రూ.3,862 కోట్ల ఆదాయం
  • ముగిసిన భూముల వేలం పాట

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్​ఎండీఏ) శుక్రవారం నిర్వహించిన నాలుగో విడత వేలంలో కోకాపేటలోని నియోపొలిస్​లోని గోల్డెన్​మైల్ లో ఎకరం భూమి రూ.77.75 కోట్లు పలికింది. మొత్తం నాలుగు విడతల్లో 28.98 ఎకరాల భూములను వేలం వేయడం ద్వారా హెచ్ఎండీఏ 3,862.8 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా కూకట్​పల్లిలోని వైజంక్షన్ వద్ద ఉన్న 15 ఎకరాలు కూడా వేలం వేసి ఉంటే హెచ్ఎండీఏకు కనీసంగా రూ.5వేల కోట్ల ఆదాయం సమకూరేదని చెప్పారు. 

మూసాపేటలో భూముల వేలంపై ఓ ప్రజాప్రతినిధి కొంతకాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో అధికారులు ప్రస్తుతానికి వాటి వేలాన్ని నిలిపివేశారు. శుక్రవాకం 1.98 ఎకరాల గోల్డెన్ మైల్ స్థలాన్ని కోయెస్​ ఎడ్యుకేషన్ మేనేజ్‌‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎకరాకు రూ.77.75 కోట్లకు చొప్పున సొంతం చేసుకుంది. ఈ లెక్కల ప్రకారం నియోపొలిస్ వేలం సగటు ధర ఎకరాకు రూ.137.36 కోట్లకు పెరిగింది. ఇది 2023లో నిర్వహించిన వేలంతో పోల్చితే 87 శాతం పెరుగుదల ఉందని అధికారులు చెబుతున్నారు.

త్వరలో మరిన్ని భూముల వేలం

హెచ్​ఎండీఏ భూములంటేనే నమ్మకమైనవిగా రియల్టర్లు భావిస్తుంటారు. దీంతో దేశవిదేశీ కంపెనీలు, ఇన్వెస్టర్లు, రియల్టర్లు హైదరాబాద్​లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వివిధ ప్రాంతాల్లో ల్యాండ్​పూలింగ్ ద్వారా సేకరించిన భూములను కూడా వేలం వేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అయితే ఈసారి భారీ వెంచర్లు కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా లేఔట్లను వేసి ప్లాట్లను అమ్మడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.