‘మా’ ఎన్నికలపై హాట్ డిస్కషన్.. వారం రోజుల్లో నిర్ణయం

‘మా’ ఎన్నికలపై హాట్ డిస్కషన్.. వారం రోజుల్లో నిర్ణయం


హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పై సభ్యుల మధ్య ఆదివారం హాట్ హాట్ డిస్కషన్ జరిగింది. ఎన్నికలు ఎప్పుడు పెడతారు.. వెంటనే పెట్టాలంటూ తరచూ ఆర్టిస్టుల మధ్య మాటల తూటాలు పేలుతుండడంతో కొన్ని నెలలుగా మా ఎన్నికల వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. గత ఏప్రిల్ లో ప్రకాష్ రాజ్ రాసిన లేఖ బయటకు రావడంతో తెరపైకి వచ్చిన మా ఎన్నికల వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. 
ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పదవీ కాలం సెప్టెంబర్ వరకు ఉన్న విషయం తెలిసిందే. పదవీ కాలంలోగా ఎన్నికలు జరపాలని సభ్యులు డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అన్ని వైపుల నుంచి సీనియర్లపై ఒత్తిడి పెరుగుతోంది. సభ్యుల మధ్య మాటల తూటాలు వివాదం రేపుతున్న నేపధ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చిరంజీవి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇలాంటి  పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరిగింది. దాదాపు 135 నుంచి 160 మంది దాకా హాజరయ్యారు. ఎన్నికల తేదీ పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు సభ్యులు. సెప్టెంబర్ అని కొందరు సూచించగా.. వీలు కాకపోతే అక్టోబర్ అని మరికొందరు సూచించారు. ఎన్నికల తేదీపై సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సభ్యుల మధ్య వాగ్వాదం నేపధ్యంలో సీనియర్లు ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోయారు. సీనియర్లు కృష్ణంరాజు, మురళీమోహన్ మాట్లాడుతూ అందరి సూచనలు విన్నామని వారం రోజుల్లో ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు.

రూపాయి బిల్డింగ్ అర్ధ రూపాయికి అమ్మేశారు: మోహన్ బాబు

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ బిల్డింగ్ పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మా భవనం కోసం బిల్డింగ్  కొన్నారు. అది మళ్ళీ అమ్మేశారు. రుపాయి కి కొన్న బిల్డింగ్ అర్ధ రూపాయి కి అమ్మేశారుదాని గురించి ఎవరైనా మాట్లాడారా??? అని ప్రశ్నించారు. నన్ను కలచివెస్తున్న విషయం బిల్డింగ్ విషయమే. ఎవరో ఏదేదో మాట్లాడుతున్నారు మా అనేది గొప్ప సంస్థ అందరూ కలసి సముచిత నిర్ణయం తీసుకోండి అని మోహన్ బాబు సూచించారు. 
వీలైనంత తొందరగా ఎన్నికలు జరిపించండి: ప్రకాష్ రాజ్
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ మా బై లాస్ ప్రకారం జనరల్ బాడీ మీటింగ్ అయిన 21 రోజుల్లో ఎన్నికలు పెట్టాలని గుర్తు చేశారు. ఎంత తొందరలో అయితే అంత తొందరగా ఎలక్షన్స్ జరిపించాలని సూచించారు. సెప్టెంబర్ 12 న కాకపోతే కనీసం సెప్టెంబర్ 19 న ఎలక్షన్స్ జరిగేలా చూడండి అని ప్రకాష్ రాజ్ కోరారు. 
ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఎన్నికలు ఎంత తొందరగా అయితే అంత తొందర గా జరపాలని కోరుకుంటున్నాను అన్నారు.కొందరు సెప్టెంబర్ అని కొందరు అక్టోబర్ అని అన్నారు, అయినా డీఆర్సీ కమిటీ ఎలా చెపితే ఆ విధంగా నేను సంతకం పెడతాననని నరేష్ స్పష్టం చేశారు. 
క్రమ శిక్షణ కమిటీదే తుది నిర్ణయం
మా ఎన్నికలపై క్రమ శిక్షణ కమిటీదే తుది నిర్ణయమని మురళి మోహన్ స్పష్టం చేశారు. జనరల్ బాడీ మీటింగ్ చాలా చక్కగా జరిగిందని సంతృప్తి వ్యక్తం చేస్తూ.. క్రమ శిక్షణ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. కమిటీ నిర్ణయానికి అందరం కట్టు బడదామని అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ.. అందరు సభ్యులు చెప్పినవి విన్నాను, నా నిర్ణయాన్ని ఒక వారంలో చెపుతాను అని అన్నారు. ఫైనల్ గా మా ఎన్నికలను  క్రమ శిక్షణ సంఘం ఒక వారంలో నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.