గ్రేటర్ హైదరాబాద్ లో వంద ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన ఫాక్స్ సాగర్ చెరువు కబ్జా కోరల్లో కూరుకుపోయినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. మొత్తం 500 ఎకరాలకు గానూ.. 150 ఎకరాలు కబ్జాకు గురైందని అన్నారు. ప్రస్తుతం 350 ఎకరాలు మాత్రమే మిగిలినట్లు తెలిపారు.
2026 అక్టోబర్ 30న ఫాక్స్ సాగర్ చెరువు అభివృద్ధిలో భాగంగా హైడ్రా బృందంతో కలిసి పర్యటించారు కమిషనర్ రంగనాథ్. ఇటీవల తొలగించిన బోరుబావులను, చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు.
దాదాపు 1897లో ఏర్పాటైన ఈ ఫాక్స్ సాగర్ సరస్సు సుమారు 490-500 ఎకరాల విస్తీర్ణంలో ఉందని,2014 హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ప్రకారం 485-486 ఎకరాలుగా ఉందని తెలిపారు. చెరువు పరిధిలో దాదాపు 100 నుండి 150 ఎకరాల వరకు ఆక్రమణలు జరిగి, ప్లాట్లు వేసి కాంపౌండ్ వాల్స్ నిర్మించుకున్నారని తెలిపారు.
చెరువుల ఆక్రమణల వల్లే నగరంలో తీవ్రమైన వరదలు, మంచినీటి ఎద్దడి సమస్యలు తలెత్తుతున్నాయని స్పష్టం చేశారు. ఫాక్స్ సాగర్ పునరుద్ధరణ పనులను మొదటి దశలో దాదాపు రూ. 75 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. చెరువు ఇన్లెట్లు, అవుట్లెట్లు మూసుకుపోయి, మురికినీటి వల్ల 10 నుండి 15 అడుగుల మేర పూడిక పేరుకుపోయిందని అన్నారు..
వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. చెరువు ఎఫ్టీఎల్ (FTL) పరిధిని పూర్తి స్థాయిలో నోటిఫై చేసి, కొన్నేళ్లుగా కబ్జా చేసి నిర్మించిన ఎలాంటి అక్రమ కట్టడాలనైనా తొలగిస్తామని హెచ్చరించారు.
అక్రమ బోరుబావుల తొలగింపులో ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదని, అందరికీ ఒకటే నిబంధన వర్తిస్తుందని తేల్చిచెప్పారు. ఎండాకాలంలో కూడా చెరువు కళకళలాడేలా ఎస్టీపీ (STP)ల ద్వారా ట్రీటెడ్ వాటర్‌ను వదిలి భూగర్భ జలాలను పెంపొందిస్తామని చెప్పారు.
ఈ చెరువును అద్భుతమైన మినీ ట్యాంక్ బండ్, పార్కులు, టూరిజం హబ్‌గా తీర్చిదిద్ది మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామన్నారు. వచ్చే సంవత్సరం అక్టోబర్ నాటికి మంచినీటితో కూడిన ఫాక్స్ సాగర్ సరస్సును పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హైడ్రా కమీషనర్ రంగనాథ్ తెలిపారు.
