
ఈ మధ్య ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కొందరికి ఫ్యాషన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా స్కూటీ నడుపుతున్న వారు హెల్మెట్ ఉండదు.. ఒక చేతిలో ఫోన్.. మరో చేతిలో హ్యాండిల్.. చాలా రెక్లస్ గా డ్రైవ్ చేస్తూ చికాకు తెప్పిస్తుంటారు. బైకర్లతో పాటు ఆటోలు, కార్లు.. ఇలా అన్ని రకాల వాహనాలు నడిపే వారు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం కామన్ అయిపోయింది. అలాంటి వాళ్లపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ పై సీపీ సజ్జనార్ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం ద్వారా వారి భద్రతకే కాకుండా.. ఎదుటి వారికి కూడా అపాయం ఉన్నందున అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సిటీలోని ముఖ్య కూడళ్లలో రద్దీ సమయం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఇప్పటి వరకు ఫైన్ విధించే అవకాశం ఉండేదని.. మారిన రూల్స్ ప్రకారం పట్టుబడిన వారు కోర్ట్ కు వెళ్లాల్సిందేనని డీసీపీ చెప్పారు. కోర్ట్ ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తే దాన్నిబట్టి చర్యలు ఉంటాయని అన్నారు.
సెల్ ఫోన్ లో రీల్స్, సినిమాలు, క్రికెట్ మ్యాచ్ లు చూస్తూ కొందరు డ్రైవింగ్ చేస్తున్నారు.. సెల్ ఫోన్ ను మినీ టీవీ లా చూస్తే డ్రైవింగ్ పై కాన్సంట్రేషన్ పోతుంది.. డైవర్ట్ అవుతుంది.. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని అన్నారు.
వారం రోజులుగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న వారిపై 3 వేల 600 కేసులు నమోదైనట్లు తెలిపారు.