3 నెలల్లో మరో 275 ఈవీ బస్సులు!

3 నెలల్లో మరో 275 ఈవీ బస్సులు!
  • హైదరాబాద్​లో ఇప్పటికే అందుబాటులో 265 సర్వీసులు
  •  భారం తగ్గించుకునేందుకు గ్రీఫ్ ఫీ వసూలుకు నిర్ణయం
  • టికెట్లపై రూ.5 నుంచి రూ.10 భారం!

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరో 3 నెలల్లో 275 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే సిటీలో 265 ఈవీ బస్సులు తిరుగుతున్నాయి. వచ్చే మూడేండ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లు, వాటికి అవసరమైన చార్జింగ్ స్టేషన్లు, డిపోలకు హైటెన్షన్ విద్యుత్ లైన్లు అనుసంధానంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ నిర్ణయంతో ఆర్టీసీపై వేల కోట్ల రూపాయల భారం పడనున్నది. దీన్ని భరించేందుకు ప్రయాణికుల టికెట్లపై కనీసం రూ.5 నుంచి అత్యధికంగా రూ.10 వరకు గ్రీన్ ఫీ వసూలు చేయాలని ఆర్టీసీ భావిస్తున్నది. 

దీని ద్వారా రెండేండ్లలో సుమారు రూ.220 కోట్లు సమకూరుతాయని అంచనా. ఆర్టీసీకి గ్రీన్ ఫీ ద్వారా కొంత నిధి సమకూరినప్పటికీ, ఈ మొత్తం భారం మాత్రం అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వంపైనే పడనున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్టీసీ ప్రయాణికుల్లో సుమారు 75 శాతం మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీంతో, మహిళా ప్రయాణికుల నుంచి వసూలు చేయాల్సిన గ్రీన్ ఫీ భారం కూడా జీరో టిక్కెట్ల రూపంలో ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. కాగా, చార్జింగ్ స్టేషన్లకు హైటెన్షన్ కనెక్షన్ల కోసం ఒక్కో డిపోపై సుమారు రూ.10 కోట్లు ఖర్చు కానున్నది. 

మొత్తం డిపోలకుగాను ఆర్టీసీపై దాదాపు రూ.392 కోట్ల అదనపు భారం పడనున్నది. కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించేందుకు ఆర్టీసీ ఈ భారాన్ని భరించేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ లెక్కల ప్రకారం, ప్రస్తుతం డీజిల్ బస్సుల ద్వారా నిత్యం 600 టన్నుల కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. డీజిల్ బస్సులు తొలగిస్తేనే పర్యావరణ పరిరక్షణకు వీలు కలుగుతుంది.