సున్నం చెరువు ఆక్రమ‌ణ‌ల తొల‌గింపు.. నీటి సరఫరా చేస్తున్న 20 బోర్లను పూడ్చేసిన హైడ్రా

సున్నం చెరువు ఆక్రమ‌ణ‌ల తొల‌గింపు.. నీటి సరఫరా చేస్తున్న 20 బోర్లను పూడ్చేసిన హైడ్రా
  • 32 వాటర్​ ట్యాంకర్ల సీజ్  
  • హైడ్రా డ్యూటీని అడ్డుకున్న వ్యక్తిపై కేసు  
  • చెప్పినా వినకుండా తాగునీరంటూ సరఫరా
  • అరెస్ట్​ చేసిన మాదాపూర్​ పోలీసులు 
  • ఎఫ్టీఎల్​, బఫర్​జోన్​ నిర్ణయించిన తర్వాతే పునరుద్ధరించాలన్న ఎమ్మెల్యే 

హైదరాబాద్ సిటీ/మాదాపూర్, వెలుగు: సున్నం చెరువు ప‌రిధిలో మిగిలిన ఆక్రమ‌ణ‌ల‌ను సోమ‌వారం హైడ్రా తొలగించింది. చెరువుకు ఆనుకొని అక్రమంగా వేసిన దాదాపు 20 బోర్లను పూడ్చివేయడంతో పాటు సుమారు 32 వాటర్​ట్యాంక‌ర్లను సీజ్ చేసింది. బోర్లకు ఆనుకుని వేసిన షెడ్లను తొలగించింది. పీసీబీ ద్వారా చెరువు, బోరు నీటి ప‌రీక్షలు చేయించి ప్రమాద‌క‌ర‌మ‌ని చెప్పినా ప‌ట్టించుకోకుండా నీటి దందా చేస్తుండడం, హైడ్రా సిబ్బంది డ్యూటీకి ఆటంకం క‌లిగించడంతో వెంకటేశ్​అనే వ్యక్తిపై మాదాపూర్​పీఎస్​లో క్రిమినల్ కేసు నమోదు చేయించింది. దీంతో వెంక‌టేశ్​ను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. సిండికేట్‌గా నీటి వ్యాపారం చేయించ‌డ‌మే కాకుండా మందు పార్టీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వెంక‌టేశ్​కు చెందిన షెడ్డులో తనిఖీలు నిర్వహించి రూ.ల‌క్షల మొత్తంలో న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. 

డేంజర్​అని చెప్పినా వినిపించుకోలే..

సున్నం చెరువు పక్కన వేసిన బోర్లలో నీళ్లు విషపూరితమైనవని, హాస్టల్స్, ఐటీ కంపెనీలు, హోటల్స్​కు నీటి సరఫరా చేస్తున్న వెంక‌టేశ్​కు చెప్పినా వినిపించుకోలేదని హైడ్రా స్పష్టం చేసింది. ఆ నీళ్లలో ప్రమాదకర రసాయనాలున్నాయని చెప్పడంతో పాటు పీసీబీ రిపోర్ట్​ను బయటపెట్టినా వెంకటేశ్​ఆ నీటిని తాగునీటిగా హాస్టళ్లు, ఇండ్లకు, ఆఫీసులకు స‌ర‌ఫ‌రా చేస్తూనే ఉన్నారని, అందుకే అతడిపై మాదాపూర్​పీఎస్​లో క్రిమినల్​కేసు పెట్టామని పేర్కొంది. దీంతో పాటు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని బోర్లను పూడ్చేశామని, ట్యాంకర్లను సీజ్​చేశామని స్పష్టం చేసింది.  

హద్దులను నిర్ణయించాకే పనులు చేయాలి : ఎమ్మెల్యే గాంధీ

సున్నం చెరువులో కూల్చివేతలను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పరిశీలించారు. చెరువు ఎఫ్టీఎల్​, బఫర్​ జోన్​ సరిహద్దులను నిర్ణయించిన తర్వాతే పునరుద్ధరణ పనులను చేపట్టాలన్నారు. చెరువును పూడ్చిన వారిని వదిలి సొసైటీలోని పేద, మధ్య  తరగతి ప్రజల ప్లాట్లలోని నిర్మాణాలను నోటీసులివ్వకుండా కూల్చడం బాధాకరమన్నారు. మంగళవారం హైడ్రా కమిషనర్​ను కలవడానికి​ టైం ఇచ్చి సోమవారమే కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. గతంలో రెవెన్యూ, ఇరిగేషన్​ఆఫీసర్ల తప్పిదాల వల్ల చెరువు సరిహద్దులను మార్చారని, హైడ్రాను తప్పుదోవ పట్టిస్తున్న ఇరిగేషన్​, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. 

2014 ప్రకారమే పునరుద్ధరణ

1970లో స‌ర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్ల ప్రకారం సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎక‌రాలుందని, 2016లో హెచ్ ఎండీఏ ఈ చెరువు విస్తీర్ణాన్ని 32 ఎక‌రాలుగా పేర్కొంటూ ప్రాథ‌మికంగా నిర్ధారించిందని హైడ్రా అధికారులు తెలిపారు.  అలాగే 2014లో ఇరిగేష‌న్ , రెవెన్యూ శాఖ‌లు నిర్ధారించిన హ‌ద్దుల మేర‌కే న‌గ‌రంలో చెరువుల పున‌రుద్ధర‌ణ జ‌రుగుతోందని, సున్నం చెరువును కూడా ఈ హద్దుల మేరకే అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. అందుకే అక్కడ గ‌తంలో వేసిన లే ఔట్‌ను ఏండ్ల కిందట హుడా ర‌ద్దు చేసిందని, చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉన్నందునే అక్కడ నిర్మాణాలు చేప‌ట్టడానికి పదేండ్లుగా పర్మిషన్లు ఇవ్వడం లేదన్నారు. 

ఈ అంశం కోర్టు పరిధిలో ఉంద‌ని అక్కడి ప్లాట్ య‌జ‌మానులు చెబుతున్నారని,  ఒక వేళ ఎవరైనా న‌ష్టప‌రిహారానికి అర్హుల‌మ‌ని భావిస్తే వెంట‌నే ప్రభుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు.  ట్రాన్సఫ‌ర్‌బుల్ డెవ‌ల‌ప్‌మెంట్ రైట్స్ కింద కూడా  చ‌ట్ట ప్రకారం న‌ష్టప‌రిహారం పొంద‌వ‌చ్చన్నారు.