యూపీలో కలెక్టర్​ ఆవుకు అస్వస్థత..ఏడుగురు డాక్టర్లతో ట్రీట్​మెంట్​

యూపీలో కలెక్టర్​ ఆవుకు అస్వస్థత..ఏడుగురు డాక్టర్లతో ట్రీట్​మెంట్​

ఫతేపూర్: ఉత్తర ప్రదేశ్​లో ఓ కలెక్టర్​ ప్రేమగా పెంచుకుంటున్న ఆవు అస్వస్థతకు లోనైంది. పాపం మూగజీవి, పైగా​ ప్రేమగా పెంచుకుంటున్నారాయె.. వెంటనే చీఫ్​ వెటర్నరీ ఆఫీసర్​కు ఫోన్​ చేసిందా కలెక్టర్. వచ్చి ఆవు అనారోగ్యానికి కారణం కనుక్కుని ట్రీట్​మెంట్​ ఇవ్వాలని ఆర్డర్​ వేసింది. ఆయన ఆఘమేఘాల మీద స్పందించేసి ఏకంగా ఏడుగురు డాక్టర్లకు డ్యూటీ వేసిండు. రోజూ పొద్దున, సాయంకాలం వెళ్లి ఆవును చెక్​ చేసి రిపోర్టు ఇవ్వాలని సదరు డిస్ట్రిక్​ చీఫ్​ వెటర్నరీ ఆఫీసర్​ డాక్టర్​ ఎస్​కే తివారీ ఆదేశించిండు.

ఇదంతా ఏదో నోటి మాటమీద జరిగిన వ్యవహారమైతే బయటపడేది కాదేమో కానీ లిఖితపూర్వకంగా ఏ రోజు ఎవరు వెళ్లాలి, ఒకవేళ వారు రాకపోతే చూసుకోవాల్సింది ఎవరు.. ఆ డాక్టర్లతో సమన్వయం చేసుకోవాల్సిన లోకల్​ డాక్టర్​ వివరాలతో ఆర్డర్​ జారీ చేసిండు. ఆ కాపీ కాస్తా బయటికి రావడంతో సోషల్​ మీడియాలో వైరల్​అవుతోంది. జిల్లా వైద్యాధికారి ఆదేశించడంతో ఆ డాక్టర్లు ప్రతీ రోజు వెళ్లి ఆవును చెకప్​ చేసి రిపోర్టు ఇస్తున్నారు. జూన్​ 9న ఈ ఆర్డర్​ కాపీ విడుదలైనట్టు తెలుస్తోంది. కలెక్టర్​ అనుప్రియ దూబే ఆవు కోసం ఏకంగా ఏడుగురు డాక్టర్లను నియమించడం ఏంటనే విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి.