
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై లోక్ సభలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. ఈ ఘర్షణలో భారత సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని, ఎవరూ చనిపోలేదని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సేవలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ నెల 9వ తేదీన తవాంగ్ సెక్టర్‌లోని యాంగ్జి ప్రాంతంలో..భారత భూ భాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన చైనా సైనికులకు మన సైనికులు ధీటైన జవాబు ఇచ్చారని వెల్లడించారు. భారత భూ భాగాన్ని ఆక్రమించకుండా పీఎల్ఏను మన సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారని తెలిపారు. భారత సరిహద్దులను కాపాడేందుకు బలగాలు కట్టుబడి ఉన్నాయని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు.
అటు లోక్ సభలో విపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖండించారు. క్వశ్చన్ అవర్ జరగకుండా అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. తవాంగ్ ఘర్షణపై రాజ్ నాథ్ సింగ్ ప్రకటన 12 గంటలకు ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పినా విపక్షాలు వినిపించుకోకపోవడం సరికాదన్నారు. 1962లో చైనా చాలా భూభాగాన్ని ఆక్రమించిందన్న అమిత్ షా... బీజేపీ సర్కార్ ఉన్నంత వరకు ఒక ఇంచు భూమిని కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. చైనా దూతల నుంచి కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఈ డబ్బులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం ఖర్చు చేశారని పేర్కొన్నారు.