పిల్లలు తప్పు చేస్తే..  పేరెంట్స్ కు పనిష్మెంట్!

పిల్లలు తప్పు చేస్తే..  పేరెంట్స్ కు పనిష్మెంట్!

బీజింగ్: చైనాలో పిల్లల ప్రవర్తన సక్కగ లేకపోయినా.. వాళ్లు ఏదైనా నేరం చేసినా.. తల్లిదండ్రులకు పనిష్మెంట్ ఇవ్వాలని కమ్యూనిస్ట్ సర్కార్ యోచిస్తోంది. ఇందుకోసం కొత్తగా ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ చట్టాన్ని తేవాలని కసరత్తు చేస్తోంది. ఈ డ్రాఫ్ట్ లాను త్వరలోనే చైనీస్ పార్లమెంటు పరిశీలించనుంది. చెడు ప్రవర్తన లేదా క్రిమినల్ బిహేవియర్ కలిగి ఉన్న పిల్లల తల్లిదండ్రులు లేదా గార్డియన్ లను బాధ్యులను చేయాలని ఈ చట్టంలో ప్రభుత్వం ప్రతిపాదించింది. పిల్లల ప్రవర్తన చాలా చెడ్డగా ఉందని ప్రాసిక్యూటర్లు గుర్తిస్తే.. ఆ పిల్లల పేరెంట్స్ లేదా గార్డియన్ లను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఫ్యామిలీ ఎడ్యుకేషన్ అంశంపై కౌన్సెలింగ్ కూడా ఇవ్వాలని ఇందులో పేర్కొంది. పిల్లల కోసం తల్లిదండ్రులు తప్పనిసరిగా టైం కేటాయించాలని, ఆటలు ఆడించి, ఎక్సర్ సైజ్ లు చేయించాలని చట్టంలో ప్రతిపాదనలు చేర్చారు. ‘‘టీనేజ్ లో ఉన్న పిల్లలు తప్పు చేసేందుకు, చెడుగా ప్రవర్తించేందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ఇంట్లో వాళ్లకు సరైన ఫ్యామిలీ ఎడ్యుకేషన్ అందకపోవడమే ప్రధాన కారణం” అని చైనీస్ పార్లమెంటు (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)లో లెజిస్లేటివ్ అఫైర్స్ కమిషన్ అధికార ప్రతినిధి జాంగ్ తైవీ స్పష్టం చేశారు. ఈ వారమే పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఈ చట్టాన్ని పరిశీలించనుందని ఆయన వెల్లడించారు. 
కొన్నినెలల్లో కీలక నిర్ణయాలు.. 
పిల్లల విషయంలో చైనా ప్రభుత్వం గత కొన్ని నెలల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్ లైన్ గేమ్​లకు అడిక్ట్ కాకుండా చూడాలని, ఇంటర్నెట్ సెలబ్రిటీలను గుడ్డిగా అనుకరించరాదని ఆదేశాలు జారీ చేసింది. మైనర్​లు ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో ఒక్కో గంటసేపు మాత్రమే ఆన్​లైన్ గేమ్​లు ఆడాలని స్పష్టంచేసింది. హాలీడేస్ లో ట్యూషన్లు, హోంవర్క్ ఉండరాదని పేర్కొంది. పిల్లలు మహిళల్లా సున్నితంగా ఉండొద్దని, మగాళ్లలా దృఢంగా తయారు చేయాలంటూ స్కూళ్లు, కాలేజీలకు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గత డిసెంబర్​లో ఆదేశాలు జారీ చేయగా, ప్రభుత్వ తీరుపై దుమారం రేగింది.