కంది పోయింది.. రంది మిగిలింది

కంది పోయింది.. రంది మిగిలింది
  • ఏడు లక్షల ఎకరాల్లో సాగు చేస్తే  3 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంట 
  • వర్షాలు, తెగుళ్లతో  రైతన్న విలవిల   
  • సర్కారు నుంచి పైసా సాయం అందలే
  • వికారాబాద్​లో ఎక్కువ నష్టం

హైదరాబాద్‌, వెలుగు : ఈసారి భారీగా కందిసాగు చేసిన రైతులకు రందే మిగిలింది. సీజన్‌ ముందే భారీ దిగుబడి అంచనాలతో సాగు చేసిన రైతులకు ఏమాత్రం ఫలితం దక్కలేదు. ‘ఈ సారి కంది వేసి నిండా మునిగినం..గతంలో కంది చేన్లు ఇంతగా దెబ్బతినలేదు’ అని రైతులు వాపోతున్నారు. వచ్చిన పంటను అమ్ముకున్నా పెట్టిన పెట్టుబడికి సరిపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం జరిగి అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చినా సర్కారు నుంచి పైసా సాయం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
ఆగమైన రైతులు
గత వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 7.64లక్షల ఎకరాల్లో కంది సాగు చేశారు. 6 లక్షల టన్నులకు పైగా  పంట దిగుబడి వస్తుందని మార్కెటింగ్‌శాఖ అంచనా  వేసింది. రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్‌లో 1.76 లక్షల ఎకరాలు, నారాయణపేట్‌లో 1.11లక్షల ఎకరాలు, సంగారెడ్డిలో 90వేల ఎకరాలు, ఆదిలాబాద్‌లో 60వేలు, ఆసిఫాబాద్‌లో 38వేల ఎకరాలు, రంగారెడ్డిలో 33వేల ఎకరాలు, గద్వాలలో 27వేల ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో 26వేల ఎకరాలు సాగైంది. ఇలా భారీగా సాగు పెరిగినా దిగుబడి మాత్రం సగం కూడా రాలేదు.  వికారాబాద్​ జిల్లాలో  అయితే కంది రైతులు ఆగమైన్రు. 
వానల ఎఫెక్ట్‌..
గత ఏడాది అక్టోబర్, నవంబర్​ నెలల్లో కురిసిన వర్షాలతో పూత, మొగ్గదశలో ఉన్న కందిచేన్లు దెబ్బతిన్నాయి. ఈ రెండు నెలల్లో వర్షాలు ఆగకుండా కొట్టడంతో వేరుకుళ్లు తెగులు సోకింది . ఇది  కంది పంటపై భారీగా ఎఫెక్ట్‌ చూపించింది. అంతటా దాదాపు పావు వంతు వంట పూర్తిగా దెబ్బతిన్నది. అంతే కాకుండా మిగిలిన పంట పూత దశలో ఉండగా వాతావరణ ప్రభావంతో మరింత ఎఫెక్ట్‌ పడింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల ఎకరాలకు పైగా పంట పూర్తిగా నాశనమైంది.   
రూ.300 కోట్ల నష్టం 
ఎకరానికి  8 నుంచి 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుందనుకుంటే కనీసం రెండు మూడు క్వింటాళ్లు కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా ఇందులో సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో రాష్ట్ర రైతాంగం క్వింటాల్లకు మద్దతు ధర రూ.6300 చొప్పన దాదాపు రూ.300 కోట్లకు పైగా నష్టపోయారు. 

ఇంత పెద్ద నష్టం ఎప్పుడు జరగలే..
 నాలుగెకరాల్లో కందులు వేసిన.  వర్షాలకు పంట దెబ్బతిన్నది. రెండెకరాలు పూర్తిగా పోగా, మిగిలిన దాంట్లో సరిగ్గా దిగుబడి రాలేదు. 32 క్వింటాళ్ల కందులు  పండుతాయనుకుంటే కేవలం 5 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. రూ.5900 చొప్పున అమ్ముకున్నం. లాగోడి పైసలు రాలేదు. ఇంత నష్టం ఎన్నడూ జరగలే. 
– కొండా లక్ష్మీకాంత్‌రెడ్డి, రైతు,   నష్కల్‌, వికారాబాద్‌ జిల్లా