ప్రజల సమస్యలు పట్టించుకోండి.. వారి ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించండి: అధికారులపై మంత్రి వివేక్ ఫైర్

ప్రజల సమస్యలు  పట్టించుకోండి.. వారి ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించండి:  అధికారులపై మంత్రి వివేక్ ఫైర్
  • ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంపై అసంతృప్తి 
  • మిషన్ భగీరథ, ట్రాన్స్ కో​అధికారులపై ఆగ్రహం
  • మంచిర్యాల జిల్లా ఐడీఓసీలో అధికారులతో రివ్యూ

మంచిర్యాల, వెలుగు: 
మంచిర్యాల జిల్లాలోని వివిధ శాఖల అధికారులపై రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కుమార్ దీపక్​తో కలిసి సోమవారం ఐడీఓసీలో వివిధ శాఖల అధికారులతో చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, ట్రాన్స్ కో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యపై మిషన్ భగీరథ అధికారులను మందలించారు. విద్యుత్ సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ట్రాన్స్​కో అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో యూరియా కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే ప్రయత్నాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఎలా కొనసాగుతోంది? క్వాలిటీతో కడుతున్నారా? అని ఆరా తీశారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఎంత పంట నష్టం జరిగింది? బాధితులకు పరిహారం అందించారా? అని అడిగారు. గ్రామాల్లో రోడ్లు,డ్రైనేజీ నిర్మాణ పనుల స్టేటస్ తెలుసుకున్నారు. 

‘ఆరోగ్య మహిళ’ పోస్టర్లు రిలీజ్..

ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు మహిళల ఆరోగ్యంపై ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ‘ఆరోగ్య మహిళ–- శక్తివంతమైన కుటుంబం’ పోస్టర్లను మంత్రి వివేక్ రిలీజ్ చేశారు. సీహెచ్​సీ, పీహెచ్​సీలు, యూపీహెచ్​సీలు, బస్తీ దవాఖానాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య నిపుణుల ద్వారా శిబిరాల్లో పరీక్షలు నిర్వహించి మందులు అందించనున్నట్టు డీఎంహెచ్​వో డాక్టర్ అనిత తెలిపారు. జిల్లాలో 13 రోజులపాటు 91 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 

రైతులకు వ్యవసాయ  పనిముట్లు పంపిణీ

గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గ రైతులకు వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను మంత్రి అందజేశారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన,- వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఉత్పాదకత పెంపుదల కింద 75 శాతం రాయితీతో వ్యవసాయ పరికరాలు అందజేశారు. జైపూర్ మండలంలోని ఆరు గ్రామాలకు మొదటి దశలో 597 పరికరాలు మంజూరయ్యాయని తెలిపారు.