
- జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్,
- మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ
- రాష్ట్రంలో వచ్చే పదేండ్లలో రూ.80 వేల కోట్లతో రైల్వేల అభివృద్ధి: సంజయ్
- రూ.3.5 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభిస్తం
- -బడుగుల ఆశాజ్యోతి కాకా.. ఆయనను స్మరించుకోవడం మంచి సంప్రదాయం
- గత బీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి సహకరించకపోవడంతో తెలంగాణకు చాలా నష్టం జరిగిందని కామెంట్
- మొదటిసారి రైల్వే బడ్జెట్‌లో వందే భారత్హాల్టింగ్పై మాట్లాడా: వంశీకృష్ణ
- రైలును మంచిర్యాల ప్రజలు వినియోగించుకోవాలి: మంత్రి వివేక్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల ప్రజల కోరిక నెరవేరింది. నాగ్‌పూర్ – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంచిర్యాల స్టేషన్‌లో ఆగింది. సోమవారం మంచిర్యాల స్టేషన్‌లో నాగ్‌పూర్–-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. వచ్చే పదేండ్లలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ.80 వేల కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. గత పదేండ్లలో రూ.42 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో 5 వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయని, త్వరలోనే హైదరాబాద్-–పుణె, హైదరాబాద్-–నాందేడ్ కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. ‘‘2014 రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.258 కోట్లు ఇస్తే... ఈసారి కేంద్ర ప్రభుత్వం రూ.5,300 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ప్రస్తుతం తెలంగాణలో 40 రైల్వే ప్రాజెక్టుల కింద 4,300 కిలోమీటర్ల పనులు నడుస్తున్నాయి. వీటిని పూర్తి చేయడానికి రూ.80 వేల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద తెలంగాణలో ఎయిర్ పోర్టులను తలపించేలా రైల్వే స్టేషన్లను డెవలప్ చేస్తున్నారు. మంచిర్యాల స్టేషన్‌లో రూ.26 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి” అని తెలిపారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత పదేండ్లలో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి సహకరించకపోవడం వల్ల తెలంగాణ చాలా నష్టపోయిందని చెప్పారు. అందుకే ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పారని అన్నారు. త్వరలో మంచిర్యాలలో రూ.3.5 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
కాకాను చాలాసార్లు కలిశా
బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆశాజ్యోతి కాకా వెంకటస్వామి అని కేంద్ర మంత్రి బండి సంజయ్అన్నారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు చాలా సందర్బాల్లో తాను కలిశానని గుర్తు చేసుకున్నారు. కార్యకర్తలను కాకా చాలా ఎంకరేజ్ చేసేవారని, ప్రజా సమస్యలను పరిష్కరించేవారని చెప్పారు. అలాంటి గొప్ప నాయకుడిని స్మరించుకోవడం ఒక మంచి సంప్రదాయం అని పేర్కొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కమిట్‌మెంట్, కసి, పట్టుదల కలిగిన లీడర్ అని ప్రశంసించారు.
రైల్వే కనెక్టివిటీతో అభివృద్ధి: ఎంపీ వంశీకృష్ణ
రైల్వే కనెక్టివిటీతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ‘పార్లమెంట్‌లో మొదటిసారి రైల్వే బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు పెద్దపల్లి, మంచిర్యాల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని కోరా. ఆ తర్వాత చాలాసార్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే మేనేజర్‌ను, ఢిల్లీలో రైల్వే ఉన్నతాధికారులను, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి విన్నవించా’’నని చెప్పారు. కిందటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా మంచిర్యాలలో వందే భారత్‌కు హాల్టింగ్ ఇవ్వాలని కోరానని తెలిపారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మినిస్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి సంస్థ ద్వారా రైల్వే శాఖకు ఏటా రూ.10 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తున్నదని చెప్పారు. గతంలో కాకా వెంకటస్వామి, మంత్రి వివేక్ వెంకటస్వామి.. మంచిర్యాల, పెద్దపల్లిలో పలు రైళ్ల హాల్టింగ్ కోసం, కొత్త రైళ్ల ప్రారంభం కోసం కృషి చేశారని, వారి బాటలోనే తానూ నడుస్తానని అన్నారు.
కొత్త రైళ్ల ప్రారంభానికి కృషి చేశా: మంత్రి వివేక్
గతంలో తాను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు కొత్త రైళ్ల ప్రారంభానికి కృషి చేశానని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఎంపీగా గెలిచిన వంద రోజుల్లోనే ‘సికింద్రాబాద్- –- బెల్లంపల్లి ఇంటర్సిటీ రైలు శాంక్షన్ చేయించా. రామగుండం, క్యాతనపల్లిలో రెండు రోడ్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేయించా’నని చెప్పారు. మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు ఉదయం రైలు సౌకర్యం లేదని, వందే భారత్ హాల్టింగ్‌తో ఆ కొరత తీరిందని అన్నారు. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం మంచిర్యాలలో కేరళ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఇవ్వాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కేంద్ర మంత్రి సంజయ్‌ను కోరారు. రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను రూ.10 వేల కోట్లతో రీ ఓపెన్ చేయించామని, హెడ్ ఆఫీస్ హర్యానాలో ఉండడం వల్ల సూపర్విజన్ సరిగా లేక కొద్దిరోజులుగా ప్లాంట్ బంద్ ఉందని, దీంతో రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తిందని వివేక్ అన్నారు. మంచిర్యాల ప్రజలు వందే భారత్ రైలును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు, కలెక్టర్ కుమార్ దీపక్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం.గోపాలకృష్ణన్, చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.