జనాల్లోకి వెళ్తే తప్పకుండా మాస్క్ పెట్టుకోండి : మంత్రి దామోదర రాజనర్సింహా

జనాల్లోకి వెళ్తే తప్పకుండా మాస్క్ పెట్టుకోండి  :  మంత్రి దామోదర రాజనర్సింహా

హైదరాబాద్, వెలుగు: జనాల్లోకి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే దవాఖానకు వెళ్లి టెస్ట్ చేసుకోవాలన్నారు. రద్దీ ప్రదేశాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించాలని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు, హాస్పిటల్స్​లోని పరిస్థితులపై మంత్రి బుధవారం సెక్రటేరియెట్​లో అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కొత్త వేరియంట్ జేఎన్‌‌.1 ప్రమాదకరం కాదన్నారు. ఉస్మానియాలో జరిగిన రెండు మరణాలు, నీలోఫర్ చిన్నారి మృతికి వైరస్ కారణం కాదని తెలిపారు. ఈ ముగ్గురికీ రకరకాల దీర్ఘకాలిక జబ్బులు ఉన్నాయన్నారు. వారు కరోనా బారినపడినప్పటికీ.. దీర్ఘ కాలిక వ్యాధుల కారణంగానే చనిపోయారని తెలిపారు. జేఎన్‌‌.1 వేరియంట్ ప్రమాదకరం కానప్పటికీ, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. 

కరోనా వ్యాప్తిపై వస్తున్న పుకార్లు నమ్మొద్దని సూచించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కరోనా టెస్టులకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని, ఆక్సిజన్ ప్లాంట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు.