- ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయం.. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణ
- అందుకే ‘సర్’ను ఆ పార్టీ వ్యతిరేకిస్తున్నది
- డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రం అభివృద్ధిలోకి..
- దిబ్రూగఢ్‌లో 10 వేల కోట్లతో అమ్మోనియా యూరియా ప్లాంట్‌కు శంకుస్థాపన
నామ్‌రూప్(అస్సాం): దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ పార్టీ కొమ్ముకాస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు అస్సాంలో స్థిరపడేందుకు సాయపడుతోందని ఆరోపించారు. ఆదివారం అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలోని నామ్‌రూప్‌లో రూ.10,601 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న ‘అమ్మోనియా -యూరియా’ ఎరువుల ప్లాంట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నామ్‌రూప్ ఎరువుల ప్లాంట్ దేశ పారిశ్రామిక వృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ఇది రైతులకు మద్దతిస్తుందని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. పాత ప్లాంట్‌ను ఆధునీకరించడానికి, రైతుల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రయత్నించలేదని మోదీ ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో అనేక ఎరువుల ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కొత్త ప్లాంట్లు స్థాపించామని మోదీ చెప్పారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని, అస్సాం సంస్కృతిని, అస్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నదని మండిపడ్డారు. అక్రమ వలసదారులను అస్సాం అడవుల్లో, భూముల్లో స్థిరపడేలా కాంగ్రెస్ సహకరిస్తున్నదని, ఇది దేశ వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు.
అందుకే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఆ పార్టీ వ్యతిరేకిస్తున్నదని అన్నారు. కానీ, తాము అస్సాం ప్రజల గుర్తింపు, ఉనికి, గర్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
దేశానికి కాంగ్రెస్ తీరని అన్యాయం
దేశానికి కాంగ్రెస్ ఎన్నో అన్యాయాలు చేసిందని, గత 11 ఏండ్లలో వాటిని సరిదిద్దినా ఇంకా చాలా పని మిగిలి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘డాక్టర్ భూపెన్ హజారికకు భారతరత్న ఇచ్చినప్పుడు కాంగ్రెస్ దానిని వ్యతిరేకించింది. ‘మోదీ నాటకాలు, పాటలు పాడే వారికి భారతరత్న ఇస్తున్నాడు’ అని భూపెన్ను, అస్సాం ప్రజలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అవమానించారు” అని విమర్శించారు.
అహోం రాజవంశం కాలంలో ఉన్నంత శక్తివంతంగా అస్సాంకు పూర్వవైభవం కల్పించడమే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. ‘‘పారిశ్రామికీకరణ, కనెక్టివిటీ అస్సాం కలలను నెరవేరుస్తున్నాయి. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం యువతకు కొత్త కలలు కనే శక్తినిస్తున్నది” అని తెలిపారు. అస్సాం టీ గార్డెన్ కార్మికులకు 7.5 లక్షల జన్ ధన్ ఖాతాలు తెరిచామని, నేరుగా నిధులు బదిలీ చేస్తున్నామని వివరించారు.
ఈశాన్య అభివృద్ధి లేకుండా భారత్ అభివృద్ధి సాధ్యం కాదని, అస్సాం అభివృద్ధిని ప్రజలు పొగుడుతున్నారని తెలిపారు. గతంలో (యూపీఏ హయాంలో) యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడేవారని, పోలీసులు లాఠీచార్జీ చేసేవారని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని బీజేపీ ప్రభుత్వం సరిదిద్దుతున్నదని అన్నారు.
యూరియా ఉత్పత్తి 2014లో 225 లక్షల టన్నులు ఉంటే.. ఇప్పుడు 306 లక్షలకు పెరిగిందని తెలిపారు. దేశానికి 380 లక్షల టన్నుల యూరియా అవసరమని, ఆ అంతరాన్ని తగ్గిస్తున్నామని చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.4 లక్షల కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ అయ్యాయని తెలిపారు.
అస్సాం అమరవీరులకు మోదీ నివాళి
రెండో రోజు పర్యటనలో ప్రధాని మోదీ గువాహటిలోని ‘స్వాహిద్ స్మారక్ కేత్ర్’ ను సందర్శించారు. 1979–85 మధ్య కాలంలో అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన ‘అస్సాం ఉద్యమం’లో ప్రాణాలు కోల్పోయిన 860 మంది అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. ఉద్యమ తొలి అమరవీరుడు ఖర్గేశ్వర్ తాలూక్దార్ విగ్రహాన్ని సందర్శించారు. ప్రధాని వెంట అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, సీఎం హిమంత, కేంద్ర మంత్రి సోనోవాల్, రాష్ట్ర మంత్రి అతుల్ బోరా ఉన్నారు.
