ఆగస్టులో తక్కువే.. సెప్టెంబరులో మంచి వర్షాలు..నైరుతి సీజన్ సెకండాఫ్ అంచనాలు విడుదల చేసిన ఐఎండీ

ఆగస్టులో తక్కువే.. సెప్టెంబరులో మంచి వర్షాలు..నైరుతి సీజన్ సెకండాఫ్ అంచనాలు విడుదల చేసిన ఐఎండీ
  • రాష్ట్రంలో ఆగస్ట్, సెప్టెంబర్ కలిపి 106% కన్నా ఎక్కువ వర్షాలు 
  • ఈ నెలలో మాత్రం ఉత్తరాది జిల్లాల్లో వర్షాభావం.. దక్షిణాది జిల్లాల్లో వానలు  
  • వచ్చే నెల అన్ని జిల్లాల్లోనూ సాధారణం కన్నా ఎక్కువ వానలకు చాన్స్  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ సెకండాఫ్​లో మంచి వర్షాలే కురవనున్నాయి. రెండు నెలల సగటు వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువే నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. వర్షాకాల సీజన్ రెండో అర్ధభాగంలో వర్షాల పరిస్థితిపై ఐఎండీ తాజాగా అంచనాలను విడుదల చేసింది. రెండు నెలల సగటు ఎక్కువే ఉన్నా.. ఆగస్టులో మాత్రం తక్కువ వర్షాలే పడతాయని ఐఎండీ తెలిపింది. అయితే, సెప్టెంబర్​లో మాత్రం భారీ వర్షపాతం రికార్డయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 

మొత్తంగా ఈ రెండు నెలలు కలిపి సగటు వర్షపాతం106 శాతం కన్నా ఎక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఆగస్టులో మాత్రం 94 నుంచి 106 శాతం మధ్య నమోదు కావచ్చని తెలిపింది. అయితే, ఈ నెలలో రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడొచ్చని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. దక్షిణాది జిల్లాల్లో మాత్రం సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం రికార్డయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక వచ్చే నెలలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.  

జులైలో మంచి వర్షాలే పడ్డయ్..

రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఆశించిన సమయం కన్నా ముందే ప్రవేశించినా.. జూన్​లో మాత్రం వర్షాలు అంతంత మాత్రమే పడ్డాయి. జూన్ లో సగటున130.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉన్నా.. 104.2 మిల్లీమీటర్ల వర్షపాతమే రికార్డయింది. 20 శాతం లోటు ఏర్పడింది. గాలుల ప్రభావం ఉండడం.. అల్పపీడనాలు ఏర్పడకపోవడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 

అయితే, జులైలో మాత్రం వర్షాలు పుంజుకున్నాయి. రెండో వారం వరకు సరైన వర్షాలు లేకపోయినా.. ఆ తర్వాత బాగానే పడ్డాయి. జులై 16 నుంచి రాష్ట్రంలో వరుసగా భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రమంతా ముసురు పట్టింది. దీంతో లోటు వర్షపాతం దాదాపుగా కవరైపోయింది. జులైలో 227.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. 237.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు ఒకే చోట పడకుండా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ డిస్ట్రిబ్యూట్ అవ్వడంతో అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతం కవరైంది. మొత్తంగా ఈ సీజన్​లో ఇప్పటివరకు 363.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. 342.4 మిల్లీమీటర్లు రికార్డయింది.