
జూలైలో తప్పిపోయిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను చూపుతున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి మృతదేహాలు ఇంకా లభ్యం కానప్పటికీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈ కేసును పరిశీలిస్తోంది. ఇక ఈ ఫొటోల విషయానికొస్తే మైతేయి కమ్యూనిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు హిజామ్ లింతోంగంబి(17), ఫిజామ్ హేమ్‌జిత్(20)గా అధికారులు గుర్తించారు.
ఈ ఫొటోల్లో ఒకదాంట్లో సాయుధ బృందం ఓ గడ్డి కాంపౌండ్ వద్ద కూర్చున్నట్లు చూపిస్తుంది. ఇందులో లింతోంగంబి వైట్ షర్ట్ లో కనిపిస్తుండగా, హేమ్‌జిత్ ఆమె పక్కనే చెక్ షర్ట్ లో చూస్తూ కనిపించాడు. వారి వెనుక ఇద్దరు వ్యక్తులు తుపాకీలతో స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇక మరొక ఫొటోలో వారి డెడ్ బాడీలు కనిపించాయి.
ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ కేసును ఛేదించడానికి పోలీసులకు ఇంత సమయం ఎందుకు పట్టిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. జూలైలో షాపుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఇద్దరు విద్యార్థులు కనిపించినా వారి జాడ తెలియలేదు. జూలై నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థుల ఫొటోలు సోషల్ మీడియాలో వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించడం గమనార్హం. అయితే ఈ ఇద్దరి విద్యార్థుల హత్యలో పాల్గొన్న వారందరిపై వేగవంతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది.