- దమ్ముంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి: ప్రియాంక గాంధీ
అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని ప్రియాంక గాంధీ అన్నారు. ఈ అంశాన్ని నొక్కి చెప్పడానికి రామాయణంలోని అంశాలను ఆమె ప్రస్తావించారు. ‘‘సత్యం కోసం శ్రీరాముడు పోరాడినప్పుడు, ఆయనకు ఎలాంటి అధికారం లేదు. అవసరమైన వనరులు కూడా లేవు. రథం కూడా రాముడి వద్ద లేదు. కానీ.. రావణుడి వద్ద మాత్రం సైన్యం, బంగారం, అధికారం అన్నీ ఉన్నాయి.
రాముడి బలం మాత్రం సత్యం, ఆశ, విశ్వాసం, ప్రేమ, దయ, వినయం, ధైర్యం మాత్రమే. ఈ విలువలు అన్నీ ఉన్న రాముడు అహంకారంతో ఉన్న రావణుడిని ఓడించాడు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. అది వస్తుంది, పోతుంది. అహంకారం ఏదో ఒక రోజు కూలిపోతుంది’’అని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని, సత్యాన్ని నమ్మాలని ఆమె కోరారు.
ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తున్నరు
ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలో అనుమానం వస్తున్నదని, ప్రజల్లో లోతైన అనుమానాలను కలిగిస్తున్నదని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రజాస్వామ్య సంస్థలను క్రమంగా బలహీనపరుస్తున్నారని, అన్నింటిని ప్రభుత్వం ముందు వంగి నిలబెట్టే ప్రయత్నం జరుగుతున్నదని విమర్శించారు.
‘‘బీజేపీకి ఓ ఛాలెంజ్ విసురుతున్న. దమ్ముంటే బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించి గెలిచి చూపించాలి. కానీ.. వాళ్లు అలా చేయరు. ఎందుకంటే.. బ్యాలెట్ పేపర్‌తో ఎప్పటికీ గెలవలేరని వాళ్లకూ తెలుసు. బిహార్ ఎన్నికల్లోనూ బీజేపీ ఓట్ చోరీ ద్వారానే గెలిచింది. అక్కడ ఓడిపోయినందుకు నిరాశపడొద్దు.
ప్రజల ఓటు హక్కును ఎలా హరించారో భవిష్యత్తులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేశ్ కుమార్, ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటది. ఈ ముగ్గురిని దేశప్రజలు ఎన్నటికీ మరిచిపోరు.
పార్లమెంట్‌లో బీజేపీ లీడర్లు ఆత్మవిశ్వాసం కోల్పోయారు. వారి ఓట్ చోరీ బయటపడటంతోనే ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నరు’’అని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలు బలహీనపడుతున్నప్పుడు ప్రజలు మాట్లాడాలని, అందరూ ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ ర్యాలీలో చివరగా ఇండియా కూటమి తరఫున 5 ప్రధాన డిమాండ్లను ప్రియాంక గాంధీ చదివి వినిపించారు.
- ఓటు చోరీపై ప్రతి నియోజకవర్గంలో విచారణ జరపాలి.
- ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం, డబుల్ ఎంట్రీలు వంటి అవకతవకలకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలి.
- ఎన్నికల సమయంలో మీడియా నిష్పాక్షికంగా వ్యవహరించాలి.
- రాజకీయ ప్రత్యర్థులను అకారణంగా లక్ష్యంగా చేసుకోవడం ఆపాలి. జైలులో ఉన్న ప్రతిపక్ష నాయకులను విడుదల చేయాలి.
