లక్నో: కేంద్ర మంత్రి, ఏడుసార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ నేత పంకజ్ చౌదరి ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. లక్నోలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. స్వస్తి వచనం, డమరుకం, శంఖ నాదం వంటి సంప్రదాయ ఆచారాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటివరకు అధ్యక్షుడిగా కొనసాగిన భూపేంద్ర చౌదరి పార్టీ జెండాను పంకజ్ చౌదరికి అందజేసి, నాయకత్వ బాధ్యతను బదిలీ చేశారు.
రాష్ట్రంలో ఓబీసీ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహంలో భాగంగా కుర్మి కులానికి చెందిన పంకజ్‌కు అవకాశమిచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మహారాజ్‌గంజ్ స్థానం నుంచి పంకజ్ చౌదరి ఏడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కుర్మి ఓటర్లలో కొంత అసంతృప్తి నెలకొన్నట్టు రిపోర్టులు వచ్చాయి. దీంతో ఓబీసీ వర్గాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ ఈ నియామం చేపట్టింది.
