తెలుగు అకాడమీ స్కామ్​లో.. అందరికీ కమీషన్లు

తెలుగు అకాడమీ స్కామ్​లో.. అందరికీ కమీషన్లు
  • బ్యాంక్​ మేనేజర్లు, అకౌంటెంట్లకు వాటాలు​|
  • కొట్టేసిన డబ్బుతో భూమి కొనుగోలు, రియల్​ ఎస్టేట్​ వ్యాపారం
  • బుధవారం మరో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగు: తెలుగు అకాడమీ ఎఫ్‌‌డీ స్కామ్‌‌ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎఫ్​డీల దారి మళ్లింపులో అనుభవం ఉన్న సాయికుమార్ ​అనే వ్యక్తి ఈ స్కామ్​కు స్కెచ్​ వేసినట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంక్​ మేనేజర్లను, అకాడమీ అకౌంటెంట్​ను ట్రాప్ ​చేసి.. స్కామ్​లో ఎవరి వాటాలు వారికి ఇచ్చినట్లు తేలింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్​ చేసిన సీసీఎస్ ​పోలీసులు బుధవారం మరో ఆరుగురిని అరెస్ట్‌‌ చేశారు. నలుగురు దళారులతో పాటు అకాడమీ అకౌంట్స్‌‌ ఇన్​చార్జి సెగూరి 
రమేశ్, చందానగర్‌‌‌‌ కెనరా బ్యాంక్ మేనేజర్‌‌ సాధనను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్‌‌కి తరలించారు. ఫేక్ డాక్యుమెంట్స్‌‌తో అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఎఫ్‌‌డీలు విత్‌‌డ్రా చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో యూబీఐ మేనేజర్‌‌‌‌ మస్తాన్‌‌ వలీ, ఏపీ కో ఆపరేటీవ్ క్రెడిట్‌‌ సొసైటీ చైర్మన్‌‌ సత్యనారాయణ, మేనేజర్‌‌‌‌ పద్మావతి, క్లర్క్‌‌ మొహిద్దీన్‌‌ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరి అకౌంట్స్‌‌లోని రూ.13 లక్షలు ఫ్రీజ్‌‌ చేసి, రూ.2 లక్షల క్యాష్‌‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను సీపీ అంజనీకుమార్‌‌ బుధవారం‌‌ వెల్లడించారు. 
ఎఫ్‌‌డీస్‌‌ ఫ్రాడ్‌‌లో మాస్టర్ మైండ్‌‌‌‌
ఏపీ తణుకుకు చెందిన వెంకట కోటిసాయి కుమార్‌‌(49) హైదరాబాద్‌‌లో రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారం చేసేవాడు. ఎఫ్‌‌డీ అకౌంట్స్‌‌లోని డిపాజిట్లను రియల్‌‌ ఎస్టేట్, ఫైనాన్స్‌‌ వ్యాపారాలకు తీసుకునేవాడు. మేనేజర్లు, అకౌంటెంట్స్‌‌కు కమీషన్స్‌‌ ఇస్తూ..  ప్రభుత్వ ఎఫ్‌‌డీ అకౌంట్స్‌‌ను ఫోర్జరీ సంతకాలు,ఫేక్‌‌ డాక్యుమెంట్స్‌‌తో  విత్‌‌ డ్రా చేసేవాడు. ఇలా బ్యాంక్ మేనేజర్లతో కలిసి 2012లో ఏపీ మైనార్టీ వెల్ఫేర్‌‌‌‌ సొసైటీకి చెందిన రూ.54 కోట్ల ఎఫ్‌‌డీలను విత్‌‌డ్రా చేశాడు. తర్వాత 2015లో ఏపీ హౌసింగ్‌‌ బోర్డ్‌‌కు చెందిన రూ.6 కోట్లు, చెన్నై నార్తన్‌‌ కోల్‌‌కి చెందిన రూ.25 కోట్లు ఎఫ్‌‌డీలను కొట్టేశాడు. వాటిలో ఉన్న అనుభవంతో తణుకుకు చెందిన వెంకట రమణ, ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఆర్‌‌ఎంపీ వెంకటేశ్వర రావు, ధర్మవరానికి చెందిన సోమశేఖర్‌‌‌‌తో కలిసి సాయికుమార్​ ఓ గ్యాంగ్‌‌ ఏర్పాటు చేశాడు.
మేనేజర్లు, అకౌంట్స్‌‌ ఆఫీసర్స్‌‌తో స్కెచ్‌‌
సాయికుమార్ నేతృత్వంలోని గ్యాంగ్​ బ్యాంక్‌‌ మేనేజర్లు, అకౌంట్స్ ఆఫీసర్స్‌‌తో కలిసి ఎఫ్‌‌డీల డేటా కలెక్ట్‌‌ చేసింది. కార్వాన్‌‌ యూబీఐ బ్రాంచ్‌‌ మేనేజర్‌‌‌‌ మస్తాన్‌‌ వలీని పరిచయం చేసుకున్నారు. యూబీఐ, కెనరా బ్యాంక్‌‌లోని తెలుగు అకాడమీకి చెందిన ఎఫ్‌‌డీలను టార్గెట్‌‌ చేశారు. ఇందుకోసం అకాడమీ అడ్మినిస్ట్రేటివ్‌‌ ఆఫీసర్‌‌‌‌, అకౌంట్స్ ఇన్​చార్జి సెగూరి రమేశ్​ను ట్రాప్ చేశారు. యూబీఐ మేనేజర్ మస్తాన్‌‌వలీ, చందానగర్‌‌‌‌ కెనరా బ్యాంక్ మేనేజర్‌‌‌‌ సాధనకు ఎఫ్‌‌డీ డైవర్షన్‌‌ గురించి తెలిపారు. అగ్రసేన్ బ్యాంక్‌‌లో ఏపీ మర్కంటైల్‌‌ కో ఆపరేటీవ్‌‌ క్రెడిట్‌‌ సొసైటీలో తెలుగు అకాడమీ పేరుతో ఓ అకౌంట్‌‌ ఓపెన్  చేశారు. అకాడమీ డైరెక్టర్‌‌‌‌గా నిందితుడు సోమశేఖర్‌‌‌‌ ఫోర్జరీ సంతకాలు చేశాడు. హిమాయత్‌‌నగర్‌‌‌‌లోని తెలుగు అకాడమీ అకౌంట్స్‌‌ ఇన్​చార్జి రమేశ్​ఎఫ్​డీ విత్​డ్రాయల్స్​ లెటర్స్​తోపాటు చెక్కులు ఇచ్చేవాడు. వీటి సాయంతో ఎఫ్​డీ నిధులను దారి మళ్లించి కాజేశారు.
కొట్టేసిన కోట్లతో ఆస్తుల కొనుగోలు
మస్తాన్‌‌వలీ మేనేజర్‌‌‌‌గా పనిచేసిన కార్వాన్‌‌ యూబీఐ నుంచి రూ.43 కోట్లు, సంతోష్​నగర్‌‌ బ్రాంచ్‌‌ నుంచి రూ.11 కోట్లు, చందానగర్‌‌‌‌ కెనరా బ్యాంక్‌‌ నుంచి రూ.10.5 కోట్లు దారి మళ్లించారు. మొత్తం రూ.64.5 కోట్లు అగ్రసేన్ బ్యాంక్‌‌ నుంచి విత్‌‌డ్రా చేశారు. ఏపీ మర్కంటైల్‌‌ సొసైటీ చైర్మన్‌‌కి రూ.6 కోట్లు ఇచ్చారు. ఇదే తరహాలో మేనేజర్లు మస్తాన్‌‌వలీ, సాధన, అకౌంట్స్ ఆఫీసర్ రమేశ్​కి కమీషన్‌‌ ఇచ్చారు. అకాడమీ ఎఫ్‌‌డీలను సాయికుమార్‌‌‌‌ గ్యాంగ్‌‌ రియల్ ఎస్టేట్‌‌,ఫైనాన్స్‌‌ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసింది. కొట్టేసిన డబ్బుతో సాయికుమార్ పెద్ద అంబర్‌‌‌‌పేట్‌‌లో 24 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీపీ తెలిపారు.