మేడారం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి సీతక్క

మేడారం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి సీతక్క

తాడ్వాయి, వెలుగు : మేడారం మహాజాతర సమీపిస్తున్న వేళ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, భక్తులకు చేపడుతున్న సౌకర్యాల కల్పన త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం తాడ్వాయి మండలం మేడారంలో కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్​నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్రమిశ్రతో కలిసి మేడారం మ్యూజియం, చిలకలగుట్ట, ఊరట్టంకాజ్ వే, జంపన్న వాగు, గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.

శుక్రవారం లోపు ఆర్చ్ పిల్లర్లు, సంబంధిత నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు ముందుకు సాగాలని మంత్రి అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్​పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీవో వెంకటేశ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వాల్​పోస్టర్​ రిలీజ్..

మంగపేట : ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో జనవరి 15న జరిగే హేమాచల లక్ష్మీనృరసింహ స్వామి వరపూజ కార్యక్రమానికి మంత్రి సీతక్కకు ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్.మహేశ్​ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేడారంలో బుధవారం లక్ష్మీ నరసింహ స్వామి వరపూజ మహోత్సవ వాల్ పోస్టర్ ను మంత్రి సీతక్క కలెక్టర్, ఎస్పీతో కలసి ఆవిష్కరించారు.