- కత్తితో వ్యక్తిని గాయపర్చి, గొంతు కోసుకున్న నిందితుడు
- ఇద్దరికీ చికిత్స అందిస్తున్న వైద్యులు
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి గురువారం ట్రీట్మెంట్ కోసం వచ్చిన వ్యక్తి కత్తితో హల్చల్ చేశాడు. స్థానికులు, బాదితులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియన వ్యక్తి తల, కాళ్లు, చేతులకు గాయాలతో చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ ఉన్న సిబ్బంది చికిత్స కోసం డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. వైద్యం చేస్తుండగా ఒక్కసారిగా తన దగ్గర ఉన్న కత్తి తీసి బెదిరించాడు.
భయబ్రాంతులకు గురైన సిబ్బంది. రోగులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. అడ్డువచ్చిన మహేశ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడగా, స్వల్ప గాయాలయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు పెట్టుకొన్న సైకో గొంతు కోసుకున్నాడు. ఆసుపత్రి సెక్యురిటీ సిబ్బంది తలుపులు పగులగొట్టి అతడిని పట్టుకొని చేతులు, కాళ్లు కట్టేసి చికిత్స అందించారు. దీంతో రోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సదరు వ్యక్తి బిహార్ రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించారు. రైలు నుంచి కింద పడి చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
