కోదాడ, వెలుగు: తమ వద్ద అప్పు కింద తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు పురుగు మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జెర్రిపోతులగూడేనికి చెందిన తానం రవీందర్ రెడ్డి గ్రామస్తుల వద్ద రూ.కోటి వరకు అప్పులు చేశాడు. అప్పుల బాధతో నాలుగు నెలల కింద ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు అప్పులు ఇచ్చిన వారు ఆందోళన చేయడంతో మృతుడి తండ్రి అమృతా రెడ్డి నెమ్మదిగా అప్పులు తీరుస్తానని హామీ ఇవ్వడంతో ఊరుకున్నారు.
నాలుగు నెలలు గడుస్తున్నా తమ డబ్బులు ఇవ్వకపోవడంతో గురువారం బాధితులు అమృతా రెడ్డి ఇంటి ఎదుట టెంట్ వేసి నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయకపోతే చస్తామంటూ పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేశారు. గ్రామంతో పాటు బేతవోలు గ్రామానికి చెందిన పెద్దలు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించుకుందామని బాధితులకు నచ్చజెప్పారు. వచ్చే ఆదివారం ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
