భారత జట్టు న్యూజిలాండ్ టూర్ వాయిదా

భారత జట్టు న్యూజిలాండ్ టూర్ వాయిదా
  • కరోనా నిబంధనలకు తోడు.. బిజీ షెడ్యూల్ కారణంగా రద్దయ్యే అవకాశం

న్యూజిలాండ్ లో భారత క్రికెట్ జట్టు పర్యటన వాయిదా పడింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత సిరీస్ నిర్వహిస్తామని చెబుతున్నా.. ప్రస్తుతం ఉన్న కరోనా నిబంధనలు, బిజీ షెడ్యూల్ చూస్తుంటే పర్యటన జరిగే అవకాశాలు కనిపించడం లేదు. వరల్డ్ కప్ సూపర్ లీగ్ లో భాగంగా భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య 3 వన్డే మ్యాచులు జరపాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్ కి తోడు విదేశాల నుంచి వచ్చిన వారు న్యూజిలాండ్ లో 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలన్న నిబంధన సిరీస్ కు బ్రేక్ వేస్తోంది. 
మరో వైపు ఇదే సమయంలో న్యూజిలాండ్ జట్టు కూడా భారత పర్యటనకు రానుంది. రెండు టెస్టులు మూడు టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంది. మ్యాచుల అనంతరం వారి దేశానికి వెళ్లిపోయిన తర్వాత 14 రోజులు క్వారెంటైన్ లో ఉండాలి. ఇదే జరిగితే బంగ్లాదేశ్ తో జరగాల్సిన టెస్టు మ్యాచ్ కూడా ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. భారత జట్టు మళ్లీ న్యూజిలాండ్ వెళ్లినా 14 రోజులు క్వారెంటైన్ లో ఉండాలన్న నిబంధనల వల్ల టూర్ జరగడం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. 
సిరీస్ జరిగే పరిస్థితులు కనిపించడం లేదన్న విషయంపై న్యూజిలాండ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రతినిధి స్పందిస్తూ వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత సిరీస్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. వచ్చే ఏడాదిలోగా కరోనా పరిస్థితులు సర్దుబాటు అయ్యే అవకాశం ఉందని, సిరీస్ కొనసాగే అవకాశం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.