
- టైంటేబుల్తో ఫ్రైట్ కనెక్టివిటీ
- పంజాబ్ నుంచి యూపీకి ఆహారధాన్యాలు
- హర్యానా నుంచి లక్నోకు గతి వాహన్ సర్వీసు
- రాజస్తాన్ నుంచి ముంద్రా పోర్టుకు నిర్యాత్ కార్గో సర్వీసు
న్యూఢిల్లీ: సరుకు రవాణా సేవలను రైల్వే మరింత విస్తరించింది. నార్తర్న్ రీజియన్ లో టైంటేబుల్ తో కార్గో సర్వీసులు అందించనుంది. పంజాబ్ లోని లుధియానా నుంచి ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి అన్నపూర్ణ సర్వీస్ పేరుతో ఆహారధాన్యాలను రవాణా చేయనుంది. అలాగే హర్యానాలోని ఫరూఖ్ నగర్ నుంచి లక్నోకు గతి వాహన్ సర్వీస్ పేరుతో ఆటోమొబైల్స్ ను రవాణా చేయనుంది. 557 కి.మీను 28 గంటల్లో ఈ సర్వీసు అందించనుంది.
ఇప్పటివరకూ 70 గంటల్లో ఈ సర్వీసు అందించారు. రాజస్థాన్ లోని గర్హి నుంచి గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు (1061 కిలోమీటర్లు, 32 గంటలు) నిర్యాత్ కార్గో సర్వీసు అందించనుంది. పంజాబ్ లోని రూప్ నగర్ నుంచి జమ్మూలోని అనంత్ నాగ్ కు (586 కిలోమీటర్లు, 31 గంటలు) అనంత్ నాగ్ సిమెంట్ కార్గో సర్వీసు అందించనుంది. తాజా ఫ్రైట్ సేవల విస్తరణపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ), మారుతీ సుజుకి లిమిటెడ్, సిమెంటు కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. పంజాబ్, హర్యానా నుంచి యూపీలోని లోటు ప్రాంతాలకు మిగులు ఆహార ధాన్యాలను అన్నపూర్ణ సర్వీసుతో మరింత వేగంగా రవాణా చేయవచ్చని ఎఫ్సీఐ పేర్కొంది.
గతి వాహన్ తో రవాణా సమయం 70 గంటల నుంచి 28 గంటలకు తగ్గిందని మారుతీ సుజుకి లిమిటెడ్ తెలిపింది. గర్హి నుంచి ముంద్రా పోర్టుకు 32 గంటల్లోనే కార్గో సర్వీసు అందుబాటులోకి వచ్చిందని ఎగుమతిదారులు చెప్పారు.