రఫ్పాడించిన రాఫెల్స్.. ఆపరేషన్ సిందూర్​లో 4 నుంచి 8 ఫైటర్ జెట్లు

రఫ్పాడించిన రాఫెల్స్.. ఆపరేషన్ సిందూర్​లో 4 నుంచి 8 ఫైటర్ జెట్లు
  • టార్గెట్లను మాత్రమే నేలమట్టం చేసేలా దాడులు
  • లేజర్ గైడెడ్ మిసైళ్లు, శాటిలైట్ గైడెడ్ గ్లైడ్ బాంబుల వాడకం

న్యూఢిల్లీ: పాకిస్థాన్, పీవోకేపై దాడుల్లో రాఫెల్ ఫైటర్ జెట్లు రఫ్పాడించాయి. 9 టెర్రరిస్టు క్యాంపులను నామ రూపాల్లేకుండా చేశాయి. ఆపరేషన్ సిందూర్‌‌‌‌లో భాగంగా 4 నుంచి 8 రాఫెల్ జెట్లు ఉపయోగించినట్లు తెలుస్తున్నది. పాకిస్థాన్ ఎయిర్​స్పేస్​లోకి ఎంటర్ కాకుండానే లక్ష్యాలను ఛేదించింది. టార్గెట్లను మాత్రమే నేలమట్టం చేసి, చుట్టూ పరిసరాలకు నష్టం జరగకుండా చూసేలా ప్రెసిషన్ గైడెడ్ బాంబులు, లేజర్ గైడెడ్ మిసైళ్లు, శాటిలైట్ గైడెడ్ గ్లైడ్ బాంబులను ప్రయోగించారు. గగనతలం నుంచి రాఫెల్​ఫైటర్ జెట్ లు మిసైళ్లను, బాంబులను ప్రయోగించగా.. భూతలం నుంచి ఆర్మీ మిసైళ్లను ఎక్కుపెట్టింది. వాయుసేన, ఆర్మీ రెండూ కలిసి ఒకేసారి అన్ని లక్ష్యాలపై సింక్రనైజ్డ్ ప్యాటర్న్ లో బాంబుల వర్షం కురిపించాయి.

స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్: స్కాల్ప్ లేదా స్టార్మ్ షాడో అనేది లాంగ్ రేంజ్ మిసైల్. 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్​ను ఛేదిస్తుంది. ఎయిర్ టు ఎయిర్ లాంచ్ చేసే క్రూయిజ్ మిస్సైల్. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలో అయినా పని చేస్తుంది. బవల్పూర్​లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా టెర్రరిస్ట్ క్యాంపులను స్కాల్ప్ క్రుయిజ్ మిసైల్ ధ్వంసం చేసింది. రాఫెల్ ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించారు. ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, జీపీఎస్, టెర్రైన్ రిఫరెన్సింగ్‌‌తో అనుకున్న టార్గెట్​ను ధ్వంసం చేస్తాయి. రాడార్​లో అంత ఈజీగా ఎవరూ గుర్తించలేరు. యూరోపియన్ డిఫెన్స్ కంపెనీ ఎంబీడీఏ దీన్ని తయారు చేసింది. 

లాయిటరింగ్ మ్యూనిషన్స్

లాయిటరింగ్ మ్యూనిషన్స్ ను కామికేజ్ డ్రోన్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ అని పిలుస్తారు. కొన్ని గంటల పాటు అనుకున్న టార్గెట్ ప్రాంతంలో గాల్లో తిరుగుతాయి. ఫైనల్​గా లక్ష్యాన్ని గుర్తించి క్షణాల్లో ధ్వంసం చేస్తాయి. సరైన సమయం కోసం వేచి చూసి దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. వీటిని సర్వైలెన్స్, టార్గెట్ ఐడెంటిఫికేషన్, టెర్మినల్ స్ట్రైక్ రోల్స్‌‌లో ఉపయోగిస్తారు. ఈ డ్రోన్స్.. టెర్రరిస్ట్ క్యాంపుల్లోని కచ్చితమైన లొకేషన్​ను లక్ష్యం చేస్తాయి. ముజఫర్​బాద్​లోని సయ్యద్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ను ఈ డ్రోన్లే ధ్వంసం చేశాయి. 15 నుంచి 100 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటాయి. 1.50 కేజీల పేలుడు పదార్థాలను మోయగలవు. పోలాండ్​ డబ్ల్యూబీ గ్రూప్ కు చెందిన వార్మేట్ తయారు చేసింది.

హ్యామర్ ప్రెసిషన్ బాంబులు

హ్యామర్.. (హైలీ ఏజిల్ మాడ్యులర్ మ్యూనిషన్స్ ఎక్స్​టెండెంట్ రేంజ్) బాంబులను ఉపయోగించారు. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. గాలి నుంచి భూమిపైకి లాంచ్ చేసే ప్రెసిషన్ -గైడెడ్ బాంబ్. దీన్ని గ్లైడ్ బాంబ్‌‌ అని కూడా పిలుస్తారు. ఎలాంటి నిర్మాణాలైన తునాతునకలు చేయగల సామర్థ్యం దీని సొంతం. 50 నుంచి 70 కిలో మీటర్ల రేంజ్​లోని (లాంచ్ ఎత్తుపై ఆధారపడి) టార్గెట్లను ఛేదించగలదు. 250 కేజీ, 500 కేజీ, వెయ్యి కిలోల బాంబులకు అనుసంధానం చేయొచ్చు. జామింగ్ రెసిస్టెన్స్ గా పని చేస్తుంది. ఫ్రెంచ్ కు చెందిన సఫ్రాన్ కంపెనీ తయారు చేసింది. రాఫెల్ జెట్ నుంచి లాంచ్ చేశారు.

పాక్ రాడార్‌‌‌‌కు చిక్కకుండా ఆపరేషన్ 

మన ఆర్మీ చాకచక్యంగా టెర్రర్ క్యాంపులపై దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)తో పాటు పాక్‌‌లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్‌‌‌‌’ను విజయవంతంగా పూర్తి చేసి పహల్గాం దాడికి బద్లా తీర్చుకుంది. మన యుద్ధవిమానాలు ప్రయోగించిన మిసైళ్లను కానీ, సరిహద్దుదాటి లోపలికి వచ్చని డ్రోన్లను కానీ పాక్ రాడార్ పసిగట్టలేక పోయింది. ఇంతకుముందు బాలాకోట్‌‌ ఎయిర్‌‌‌‌స్ట్రైక్స్‌‌ టైమ్‌‌లో మన ఆర్మీ పాక్ రాడార్‌‌‌‌కు చిక్కకుండా పని పూర్తిచేసుకుని వచ్చింది. కాగా, చైనాకు చెందిన ఎల్‌‌వై80 లోమాడ్స్ (లో టు మీడియం అల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్)ను పాక్ వాడుతున్నది. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చైనా ప్రచారం చేసుకుంటుండం గమనార్హం.