17వేల అడుగుల ఎత్తులో.. గడ్డ కట్టించే చలిలో..

17వేల అడుగుల ఎత్తులో.. గడ్డ కట్టించే చలిలో..
  • 17వేల అడుగుల ఎత్తులో మంచు కొండలపై సైనికుల యోగా


శ్రీనగర్: దేశ సరిహద్దుల్లో.. శరీరాలను క్షణాల్లో గడ్డ కట్టించే చలిలో.. సముద్ర మట్టానికి దాదాపు 17వేల అడుగుల ఎత్తులో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుగుతోంది. మానవత్వం కోసం యోగా అన్నది ఈ ఏడాది థీమ్ గా పెట్టారు. తెల్లవారుఝాము నుంచే బేస్ క్యాంపుల్లోని సైనికులు సూర్యోదయానికి స్వాగతం పలుకుతూ యోగాసనాలు వేశారు. ఇండో టిబెటిన్ బార్డర్ పోలీసులు లఢాక్లో యోగాసనాలు వేశారు. సముద్ర మట్టానికి 17 వేల అడుగుల ఎత్తులో చేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. గడ్డకట్టించే చలిలోనూ యోగా భ్యాసాలు, విన్యాసాలు  చేయడమే కాదు..అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక పాటను కూడా అంకితం చేశారు. 

యోగాకు విశ్వవ్యాప్తంగా ప్రజాదరణతోపాటు గుర్తింపు పెరగడం గుర్తించిన ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 2014లో డిసెంబర్ 11న ఐరాస చేసిన ప్రకటనను భారత్ సహా ప్రపంచ దేశాలు స్వాగతించి యోగాను మానవుల దైనవందిన జీవితాల్లో భాగం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇవాళ 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో సముద్రమట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉన్న ఐటీబీపీ క్యాంప్ లో మంచు వీరులు యోగాసనాలు వేశారు. అటు ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ లోనూ యోగాసనాలు వేశారు. అసోంలోని బ్రహ్మపుత్ర నదీ తీరంలోనూ యోగాభ్యాసం చేశారు.