
భోపాల్: ఆటో ప్రయాణం అంటే చాలా మంది అమ్మో అంటారు. ఉండే కొంచెం ప్లేసులోనే ఈగ దూరే సందు కూడా లేకుండా ప్రయాణికులను కుక్కేస్తారు. కనీసం మెడ పక్కకు తిప్పే అవకాశం కూడా ఉండదు కొన్నిసార్లు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడంతో గాలి ఆడక ఉక్కపోత, వేడితో నరకయాతన అనుభవిస్తారు ప్యాసింజర్స్. కానీ ఆటో ప్రయాణాన్ని ఎంతో సౌకర్యవంతంగా మార్చేశాడు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఆటో డ్రైవర్ జగదీష్ రాజ్‌పుత్. కారులో ఉండే సౌకర్యాలను ఆటోలో ఏర్పాటు చేశాడు.
ఆటోలో ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరా, ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన ఫ్యాన్లు, ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసరంగా ప్రథమ చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటివి ఆటోలో సెట్ చేశాడు. ఇవే కాకుండా ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చొవడానికి సోఫా లాంటి సీటు, చెత్త పడేయాడానికి డస్ట్ బిన్, ప్రయాణికులకు జర్నీ సమయంలో బోర్ కొట్టకుండా న్యూస్ పేపర్ వంటి సకల సౌకర్యాలు ఆటోలో ఏర్పాటు చేశాడు. జగదీష్ రాజ్‌పుత్ ఆటోకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు.. జగదీప్ రాజ్‌పుత్ ఐడియాకు హ్యాట్సాఫ్చెబుతున్నారు. ట్యాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదని మరోసారి నిరూపించావని ప్రశంసిస్తున్నారు.
►ALSO READ | రూ. 40 కోట్ల మోసం వెలుగులోకి.. తిరుమల డైరీ ట్రెజరీ మేనేజర్ ఆత్మహత్య..
ఈ క్రమంలో జగదీష్ రాజ్‌పుత్‌ను మీడియా పలకరించింది. ఎక్కడి నుంచి ప్రేరణ పొంది ఆటోను అలా మోడిఫై చేశారని ప్రశ్నించగా.. జగదీష్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. అందరిలా కాకుండా.. నా ఆటోతో విభిన్నంగా ఏదైనా చేయాలని 3 సంవత్సరాల క్రితం అనిపించిందని.. అనిపించిందే తడవుగా తన ఆటోను మోడిఫై చేశానని చెప్పారు. తన ఆటో ఎక్కే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఈ ఏర్పాట్లు చేశానన్నాడు జగదీష్.
పరిశుభ్రతలో దేశంలోనే ఇండోర్ నగరం నంబర్ 1గా ఉన్నట్లే, ఆటో సేవలు కూడా ఉత్తమంగా ఉండాలనుకుంటున్నానన్నాడు. నా తోటి డ్రైవర్లకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నానని.. వారు కూడా తమ సొంత వాహనాల్లో కూడా ఇలాంటి సౌకర్యాలను ప్రవేశపెట్టి ఇండోర్‌లో అత్యుత్తమ ఆటో సేవలు ఉండేలా చేయాలని కోరుకుంటున్నానని అన్నాడు జగదీష్. ఇన్ని సౌకర్యాలు కల్పించినందుకు అదనపు చార్జీలు వసూల్ చేయనని.. సాధారణ చార్జీలే తీసుకుంటున్నానని చెప్పారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో తన ఆటో సర్వీస్ లభిస్తుందన్నారు.