జనాభాలో 6% ఉన్న వాళ్లకే అధికారం: రాహుల్

జనాభాలో 6% ఉన్న వాళ్లకే అధికారం: రాహుల్

ముంబై: దేశ జనాభాలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు చెందినవారు 88% మంది ఉన్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కానీ పరిపాలన, న్యాయవ్యవస్థ, మీడియా సహా వివిధ రంగాల్లో వారి భాగస్వామ్యం చాలా తక్కువని వెల్లడించారు. మొత్తం జనాభాలో కేవలం 6% ఉన్న వారే అధికారం అనుభవిస్తున్నారని..దేశ సంపదను నియంత్రిస్తున్నారని ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ శుక్రవారం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాడా తాలూకాకు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.." ఓబీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ ఏం చేశారు? కేంద్రం ప్రారంభించిన పంటల బీమా పథకం వల్ల ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. 

రైతులకు ఎలాంటి ప్రయోజనంలేదు. ప్రభుత్వం బీమా కంపెనీలకు భారీగా ప్రీమియంలు చెల్లిస్తున్నా వర్షం, వడగళ్ల వానతో పంటలు నష్టపోయినప్పుడు బాధిత రైతులకు సాయం అందట్లేదు. వివిధ ప్రాజెక్టుల కోసం పేద ప్రజలే తమ భూములను త్యాగం చేస్తున్నారు. అయినా వారిని జీఎస్టీతో  దోచుకుంటున్నారు. కేంద్రంలో మేం అధికారంలోకి వస్తే పరిపాలన, ఇతర రంగాలలో అసమతుల్యతలను తొలగించడానికి దేశవ్యాప్తంగా కుల గణన చేపడతం" అని రాహుల్ పేర్కొన్నారు.