కోల్ కతాపై లాస్ట్ బాల్ కు చెన్నై థ్రిల్లింగ్ విక్టరీ

కోల్ కతాపై లాస్ట్ బాల్ కు చెన్నై థ్రిల్లింగ్ విక్టరీ
  • చివర్లో రవీంద్ర జడేజా అటాకింగ్.. 8 బంతుల్లో 22 (2 సిక్సలు, 2 ఫోర్లు) 
  • కోల్ కతా స్కోర్: 171/6, చెన్నై స్కోర్: 172/8

అబుదాబీ: ఐపీఎల్ టోర్నీ పెద్దగా ఏమీ లేదని పెదవి విరుస్తున్న అభిమానులు ఆదివారం నరాలు తెగే ఉత్కంఠ పోరు చూసి వారెవ్వా.. ఇదీ అసలైన ఆట.. అంటూ ఐపీఎల్ మజాను ఆస్వాదించారు. విజయాలతో దూసుకెళ్తున్న కోల్ కతా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి ఓవర్.. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేయగా.. చెన్నై టార్గెట్ ఛేదనలో శుభారంభం చేసినా.. మిడిలార్డర్ వైఫల్యం కొంప ముంచింది. 142 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశలో వెళ్తున్న చెన్నై జట్టును ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అటాకింగ్ చేసి గెలుపుతీరం చేర్చాడు. కేవలం 8 బంతుల్లో 2 సిక్సులు, మరో రెండు ఫోర్లతో రవీంద్ర జడేజా 22 పరుగులు చేసి ఊపిరిపోశాడు. 
ఇక చివరి ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 4 పరుగులే కావడంతో గెలుపు ఈజీ అనుకుంటే సునీల్ నరైన్ కట్టుదిట్టంగా బౌలింగ్.. కోల్ కతా ఫీల్డర్స్ పట్టుదలగా కట్టడి చేసి చెమటలు పట్టించారు. చివరి బంతి వరకు విజయం ఇరుజట్ల వైపు దోబూచులాడుతున్నట్లు ఉత్కంఠ రేపింది. అయితే లాస్ట్ బాల్ కు దీపక్ చహర్ సింగిల్ తీయడంతో  చెన్నై గెలుపొందింది. కోల్ కతా విధించిన 172 పరుగుల విజయలక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి సాధించింది.
చెన్నై జట్టులో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (40), డుప్లెసిస్ (43) తొలి వికెట్ కు 8.2 ఓవర్లలో 74 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత్ వన్ డౌన్ లో వచ్చిన మొయిన్ అలీ కూడా నిలదొక్కుకుని 32 పరుగులు చేశాడు. అ అయితే మిడిలార్డర్ లో రాయుడు (10), రైనా (11), ధోనీ (1) నిరాశపరిచడంతో చెన్నై ఓటమి బాటలో పడింది. అయితే జడేజా కోల్ కతా బౌలర్లను ఊచకోత కోసి కేవలం 8 బంతుల్లో 22 పరుగులు చేయడంతో విజయ తీరాలకు చేరింది. 
కోల్ కతా బౌలర్ల విషయానికి వస్తే నరైన్ 3, ప్రసిద్ధ్ 1, ఫెర్గుసన్ 1, వరుణ్ చక్రవర్తి 1, రస్సెల్ 1 చొప్పున వికెట్లు పడగొట్టారు.