
హైదరాబాద్, వెలుగు: రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం తెలుగులో ఇవ్వడం అభినందనీయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ మంగళవారం ట్వీట్ చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని నేను ఎప్పటినుంచో సూచిస్తున్నా. ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించిన ఇతర సమాచారం ఉండాలి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకనుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని ఆకాంక్షిస్తున్నా’ అని వెంకయ్య నాయుడు పోస్ట్చేశారు.
-
తెలుగువాళ్లందరికీ ఆనందకరం: కవి ఏనుగు నరసింహారెడ్డి
తొలిసారి తెలుగులో జీవో ఇవ్వడం తెలుగువాళ్లందరికీ ఆనందకరమని ప్రముఖ కవి -ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. ‘తెలుగు కవులు, రచయితలు, భాషాభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ‘తెలుగు జీవో’ ఇప్పుడు వచ్చింది ఇప్పటికి ఇది ఒక చరిత్ర. తెలంగాణ ప్రభుత్వ భాషాభిమనం లోకానికి ప్రకటితమైందని అన్నారు.