డబుల్​ బెడ్రూం ఇండ్లు ఇక్కడ స్పెషల్ ..గేటెడ్​ కమ్యూనిటీ తరహాలో నిర్మాణం

డబుల్​ బెడ్రూం ఇండ్లు  ఇక్కడ స్పెషల్ ..గేటెడ్​ కమ్యూనిటీ తరహాలో నిర్మాణం
  • బిల్డర్​చొరవ, అదనపు నిధులతో గుడ్​ క్వాలిటీ.. గ్రాండ్​​ లుక్ 
  • ప్రతీ బ్లాక్​ ముందు గార్డెన్​.. ఎటు చూసినా గ్రీనరీ
  • అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ,  సీసీ రోడ్లు, స్ట్రీట్​ లైట్లు
  • సకల సౌలతుల ఇండ్లతో  లబ్ధిదారుల్లో సంబురం

కామారెడ్డి, వెలుగు :  సర్కారు కట్టిస్తున్న డబుల్​ బెడ్రూం ఇండ్ల పేరు చెప్తే..  కుంగిన పిల్లర్లు,  నాసిరకం స్లాబులు,ముట్టుకుంటే కూలిపోయేలా ఉండే పిట్టగోడలు, ఇండ్ల చుట్టూ నిలిచే  నీళ్లు, మొలిచిన ముండ్ల కంపలే గుర్తుకొస్తాయి. కానీ, కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో కట్టిన డబుల్​ బెడ్రూం ఇండ్లు మాత్రం వెరీవెరీ స్పెషల్. సర్కారు ఇచ్చిన పైసలు చాలక అన్నిచోట్ల బిల్డర్లు నాసిరకంగా నిర్మిస్తే, ఇక్కడ పనులు చేసిన బిల్డర్ తిమ్మయ్యగారి సుభాష్​రెడ్డి జేబులోంచి మరిన్ని నిధులు ఖర్చు పెట్టి మరీ సకల సౌలతులతో ఇండ్లు కట్టించాడు. దీంతో ఇక్కడి డబుల్ ​బెడ్రూం  ఇండ్ల కాలనీ అచ్చు గేటెడ్​ కమ్యూనిటీని తలపిస్తోంది. ప్రతి బ్లాక్​ ముందు గార్డెన్​తో ఎటు చూసినా గ్రీనరీతో ఆకట్టుకుంటోంది. 

అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ,  చుట్టూరా సీసీ రోడ్లు, స్ట్రీట్​లైట్లతో వెలిగిపోతోంది. దీంతో ఇక్కడి లబ్ధిదారులు ఫుల్​ఖుష్​ అవుతున్నారు.   కామారెడ్డి నియోజకవర్గంలోని జంగంపల్లికి  50 డబుల్​ బెడ్రూం ఇండ్లు శాంక్షన్​ అయ్యాయి. ​హైవే పక్కన ఉన్న  జాగలో  వీటిని కట్టాలని  ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ నిర్ణయించారు. నిర్మాణ బాధ్యతను బీబీపేట మండలం జనగామకు చెందిన బిల్డర్​ తిమ్మయ్యగారి సుభాష్​రెడ్డికి  అప్పగించారు.

 అప్పటికే సొంత ఫండ్స్​తో బీబీపేటలో హైస్కూల్​ కట్టిన  సుభాష్​రెడ్డి,  తన సొంతూరు జనగామలో  52,  జంగంపల్లిలో  50 ఇండ్లను కూడా మోడల్​ కాలనీగా నిర్మించాలని నిర్ణయించారు.  కానీ, సర్కారు ఇచ్చిన ఫండ్స్​తో అది సాధ్యం కాదని భావించి, సొంతంగా మరికొన్ని నిధులు సమకూర్చారు. ప్రభుత్వం నుంచి ఇండ్ల నిర్మాణం, సౌలతుల కోసం రూ.  3.64 కోట్లు శాంక్షన్ ​కాగా,బిల్డర్​ సుభాష్​ రెడ్డి సొంతంగా ఒక్కొక్క చోట సుమారు రూ. కోటి రూపాయలు భరించడంతో  గేటెడ్​ కమ్యూనిటీ తరహాలో డబుల్​ఇండ్లు రెడీ అయ్యి, రిచ్​లుక్​లో మెరిసిపోతున్నాయి.

సకల సౌలతులు..

గేటెడ్​ కమ్యూనిటీ మోడల్​లో  6 బ్లాకుల్లో   50 ఇండ్లు  నిర్మించారు.  ఒక్కో బ్లాక్​ మధ్య  కొంత స్థలం వదిలారు.  ప్రతీ బ్లాక్​ ముందు గార్డెన్​ ఉంది.   పచ్చిగడ్డి,  మొక్కలు పెంచారు.   చుట్టూరా   స్థలం వదలడంతో గాలి, వెలుతురు ధారాళంగా వస్తోంది.   లోపల గ్రానైట్​ వేశారు.   కిచెన్​కు గ్రానైట్​ రాళ్లు వాడారు.   కిటీకీలు పీవీసీ(పాలీవినైల్​ క్లోరైడ్​)తో  చేయించారు.   హైవే నుంచి  లోపలి వరకు  సీసీ రోడ్డు,   చుట్టూరా  సీసీ రోడ్డు వేశారు.   ట్రాన్స్​ఫార్మర్ ​ నుంచి ప్రతి ఇంటికీ అండర్​ గ్రౌండ్​ కరెంట్​ సౌకర్యం కల్పించారు.  అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ సిస్టమ్​ కూడా ఉంది.   మోరీ నీళ్లు ఎక్కడా బయట కనిపించవు.   స్ర్టీట్​ లైట్లు ఏర్పాటు చేశారు.  హైవే పక్కన  ఉండడంతో అటుగా వెళ్లే ప్రతీ ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి.

సమాజానికి మేలు  చేయాలనే సకల హంగులు

ఎమ్మెల్యే సూచనతో  జనగామ,  జంగంపల్లిలో నిర్మిస్తున్న ఇండ్లను తెలంగాణలోనే మోడల్​గా తీర్చిదిద్దాం.  వీటిని చూసిన వారు మిగతా ఏరియాల్లో కూడా ఇలా కట్టడానికి ముందుకొస్తారని భావించాం.  పేదలకు అన్ని  రకాల సౌలతులతో  గేటెడ్​ కమ్యూనిటీని  తలపించేలా నిర్మించాం.   లాభాపేక్ష  లేకుండా ప్రభుత్వం కేటాయించిన నిధులకు అడిషనల్​గా  సొంతంగా డబ్బులు పెట్టుకున్న. ఈ  ఇండ్లలో  ఉండే లబ్ధిదారులకు   ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు కల్పించాం.

- తిమ్మయ్యగారి సుభాష్​రెడ్డి, బిల్డర్​

ఇంత మంచిగ కడ్తరనుకోలే! 

గవర్నమెంట్​ కట్టించే ఇండ్లంటే మామూలుగా ఉంటాయని అనుకుంటం.  కానీ మా కోసం కట్టిన డబుల్​ ఇండ్లు మంచిగున్నయ్​..ఇట్ల కడ్తరనుకోలే.  సిటీ ఇండ్లలాగా కనిపిస్తుంటే సంబురమనిపిస్తంది.   

- బాలకిషన్​, లబ్ధిదారుడు