సాక్షి ఎడిటర్‌‌ ఇంటిపై పోలీసుల దాడులు అన్యాయం

సాక్షి ఎడిటర్‌‌ ఇంటిపై పోలీసుల దాడులు అన్యాయం

సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు : విజయవాడలో సాక్షి దినపత్రిక ఎడిటర్‌‌ ధనుంజయ్‌‌రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దాడులు చేయడం అన్యాయమని జర్నలిస్టు సంఘాల నాయకులు అన్నారు. గురువారం స్థానిక వాణిజ్య భవన్‌‌ సెంటర్‌‌లో వివిధ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘాల నాయకులు ఐతగాని రాంబాబు, బంటు కృష్ణ మాట్లాడుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలు పత్రికలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నాయన్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా విజయవాడలో సాక్షి ఎడిటర్‌‌ ఇంటిపై ఏపీ పోలీసులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

మీడియాను అణచివేయాలని చూస్తే ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనం కోసం రాజ్యాంగం కల్పించిన భావస్వేచ్చ ప్రకటనపై దాడి చేయడం సిగ్గు చేటన్నారు. మరోవైపు సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డిపై దాడులను ఖండిస్తూ జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం సెంటర్‌‌లో నిరసన ర్యాలీ, రాస్తారోకో నిర్వ హించారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ అన్నారు. సాక్షి ఎడిటర్‌‌ ఇంటిపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కార్యక్రమంలో సాక్షి ఆర్‌‌సీ ఇన్​చార్జి వర్ధెల్లి అరుణకృష్ణ, సాక్షి స్టాఫ్‌‌ ఫొటోగ్రాఫర్‌‌ యాకయ్య, వివిధ జర్నలిస్టుల నాయకులు పాల్గొన్నారు.