V6 News

యాసంగి సీజన్ లో..ఆర్డీఎస్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే!

 యాసంగి సీజన్ లో..ఆర్డీఎస్  ఆయకట్టుకు క్రాప్  హాలిడే!
  • జూరాల, నెట్టెంపాడు పరిధిలో వారబందీ
  • ఆరుతడి పంటలకే సాగు నీరు
  • శివమ్  మీటింగ్ లో ఇరిగేషన్  ఆఫీసర్ల నిర్ణయం

గద్వాల, వెలుగు: యాసంగి సీజన్ లో ఆర్డీఎస్  ఆయకట్టుకు క్రాప్  హాలిడే ప్రకటించాలని ఇరిగేషన్  ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నారు. జూరాల ప్రాజెక్టు నెట్టెంపాడు లిఫ్ట్  ఇరిగేషన్  పరిధిలోని పొలాలకు వారబందీ పద్ధతిలో యాసంగి సీజన్ లో పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఇరిగేషన్  ఆఫీసర్లు చెబుతున్నారు. జూరాల లెఫ్ట్, రైట్  కెనాల్  పరిధిలోని 26, 924 ఎకరాలకు, నెట్టెంపాడు పరిధిలోని 22,800 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. ఈ నెల 3న హైదరాబాద్​లో జరిగిన శివమ్  మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఆర్డీఎస్  కింద 87,500 ఎకరాల ఆయకట్టు..

ఆర్డీఎస్  కింద 87,500 ఎకరాల ఆయకట్టు ఉంది. అలంపూర్  నియోజకవర్గంలోని అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి, వడ్డేపల్లి, అయిజ, రాజోలి మండలాల్లోని వ్యవసాయ భూములకు ఆర్డీఎస్  కింద సాగు నీటిని అందిస్తున్నారు. యాసంగిలో క్రాప్  హాలిడే ప్రకటించడంతో ఈ భూములు సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో తుంగభద్ర నదితో పాటు వ్యవసాయ బోర్లతో కొంత భూమి సాగు చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన మండలాల్లో క్రాప్  హాలిడే ప్రకటించడంతో పొలాలను బీడు పెట్టుకోవాల్సిందేనని అంటున్నారు.

జూరాల కింద 26,924 ఎకరాలకు సాగు నీరు..

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఇందులో లెఫ్ట్, రైట్  కెనాల్ కు సంబంధించి 26,924 ఎకరాలకు సాగు నీటిని అందించనున్నారు. రైట్  కెనాల్  ద్వారా 15 వేల ఎకరాలు, లెఫ్ట్  కెనాల్  ద్వారా 11,924 ఎకరాలకు సాగు నీటిని అందించాలని ఆఫీసర్లు నిర్ణయించారు. జూరాల రైట్  కెనాల్  కింద డి–-31 డిస్ట్రిబ్యూటర్  బసలచెరువు వరకు సాగు నీటిని అందించనున్నారు. లెఫ్ట్  కెనాల్  కింద రామన్ పాడు ఆయకట్టు వరకు నీరు అందిస్తామని చెబుతున్నారు.

నెట్టెంపాడు లిఫ్ట్  కింద 22,800 ఎకరాలు..

నెట్టెంపాడు లిఫ్ట్  ఇరిగేషన్ కింద 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. యాసంగి పంటకు 22,800 ఎకరాలకు సాగు నీటిని వారబందీ పద్ధతిలో ఇవ్వాలని ఆఫీసర్లు నిర్ణయించారు. నెట్టెంపాడు లిఫ్ట్  పరిధిలోని ర్యాలంపాడ్  రిజర్వాయర్  కుడి కాలువ ద్వారా 10 వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 5 వేల ఎకరాలకు సాగు నీటిని అందించనున్నారు. గుడ్డందొడ్డి రిజర్వాయర్  నుంచి 4,800 ఎకరాలకు, ముచ్చోనిపల్లి రిజర్వాయర్  నుండి 3 వేల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

ఆరుతడి పంటలే సాగు చేయాలి..

నెట్టెంపాడు, జూరాల పరిధిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. ఆరుతడి పంటలు సాగు చేస్తే వారబందీ పద్ధతిలో జూరాల, నెట్టెంపాడు పరిధిలో సాగు చేసిన పంటలకు ఏప్రిల్ 15 వరకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. వారంలో మూడు రోజులు నీటిని విడుదల చేసి, నాలుగు రోజులు బంద్​ పెట్టనున్నారు.