కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల షాపుల షెటర్లు పగుల గొట్టి చోరీలకు పాల్పడిన అంతర్రాష్ర్ట ముఠాలోని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర బుధవారం మీడియాకు తెలిపారు. ఈ నెల8, 9 తేదీల్లో జిల్లా కేంద్రంలో 4 షాపుల షెటర్లు పగుల గొట్టి చోరీ చేశారన్నారు. 2 బైక్‌లు అపహరించారని పేర్కొన్నారు. టౌన్, సీసీఎస్ సీఐలు, సిబ్బంది స్పెషల్ టీమ్‌గా ఏర్పడి ఆయా ఏరియాల్లో సీసీ కెమెరాలను పరిశీలించి మంగళవారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీ వద్ద నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నలుగురు కలిసి ముఠాగా ఏర్పడి మెయిన రోడ్లలో చోరీలకు పాల్పడుతున్నారన్నారు.
మహారాష్ర్టలోని హింగోలి తాలుకా వస్మంత్ గ్రామానికి చెందిన సోను ఫిరాజి పవార్, అనికేత్ జాదవ్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లు ముఠాగా ఏర్పడ్డరని తెలిపారు. సోను ఫిరాజి పవార్, అనికేత్ జాదవ్‌లు పరారీలో ఉండగా, ఇద్దరు మైనర్లను అరెస్ట్‌చేశామన్నారు. వీరి నుంచి బైక్, ఇనుప రాడ్లు, మాస్కులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వీరిపై మెట్పల్లి, జగిత్యాలలో కూడా కేసులు ఉన్నాయన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి, సీఐలు నరహరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫోన్ చేస్తే బాధితుల ఇంటి వద్దే ఎఫ్ఐఆర్
కామారెడ్డి : పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుల ఇండ్ల వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. బుధవారం దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. శారీరక దాడులు, అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు, బాల్య వివాహలు, ర్యాగింగ్, మైనర్ వేధింపులు, గృహహింస వంటి కేసుల్లో బాధితులకు ఉపయోగపడుతుందన్నారు.
