Karnataka Elections 2023 : కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.. ఈ సారి అధికార పీఠమెవరిది

Karnataka Elections 2023 : కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.. ఈ సారి అధికార పీఠమెవరిది

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మే 13న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 10న కర్ణాటకలోని 224 నియోజకవర్గాలకు ఎలక్షన్స్ జరగగా.. అదే రోజులు కొన్ని ఎగ్జిట్ పోల్ ఏజెన్సీలు ఫలితాల అంచనాలను రిలీజ్ చేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని ఏజెన్సీలు హంగ్ ఏర్పడుతుందని చెప్పగా.. హెచ్‌డి కుమారస్వామికి చెందిన జనతాదళ్ (సెక్యులర్) కీలక పాత్ర పోషించడంతో కాంగ్రెస్‌కు స్వల్ప ప్రయోజనం చేకూరుతుందని మరికొన్ని ఏజెన్సీలు సూచిస్తున్నాయి. ఈ సారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ యొక్క జేడీ (ఎస్) మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

కౌంటింగ్ ..

రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో మే 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది, మధ్యాహ్నం నాటికి ఫలితంపై స్పష్టమైన సమాచారం వెలువడే అవకాశం ఉందని పోల్ అధికారులు భావిస్తున్నారు. ఇక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి కౌంటింగ్ కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తాము ఏ పార్టీకి మద్దతివ్వాలో ఇప్పటికే నిర్ణయించుకున్నామని జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధికార ప్రతినిధి తన్వీర్ అహ్మద్ తెలిపారు. 'ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ఇప్పటికే నిర్ణయించుకున్నామని.. తగిన సమయం వచ్చినప్పుడు ప్రజలకు తెలియజేస్తాం' అని ఆయన తెలియజేశారు. ఇంతకుముందు జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 14నెలల్లోనే విఫలమై.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో BS యడియూరప్ప సీఎంగా ఉండగా.. ఆ తర్వాత బసవరాజు బొమ్మై సీఎంగా కొనసాగారు.