
ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారితే రాజీనామాకు సిద్ధమని కర్ణాటక న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి స్పష్టం చేశారు. సీఎంకు, పార్టీకి మేలు జరుగుతుందనుకుంటే తాను సంతోషంగా రాజీనామా చేస్తానని అన్నారు. ‘‘మేం ప్రభుత్వాన్ని నడపడం లేదు.. అలా మేనేజ్ చేస్తున్నామంతే..’’ అంటూ మంత్రి మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో లీకై పెద్ద దూమారాన్నే లేపింది. జేసీ మధుస్వామి వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో సీఎం బసవరాజ్ బొమ్మై దిద్దుబాటు చర్యలకు దిగారు. మంత్రి వ్యాఖ్యల్ని తప్పుడు అర్థంలో తీసుకోవద్దని కోరారు.
జేసీ మధుస్వామి క్లారీటీ..
లీకైన ఆడియోపై మంత్రి మధుస్వామి స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ఓ రైతు జిల్లా సహకార బ్యాంకులో మోసపోయానని చెప్పినప్పుడు, తాను ఆ విధంగా స్పందించానన్నారు. ఆ రోజు తాను ఎలా మాట్లాడానో తెలియదని, ఆడియో విన్న తర్వాత ఏం మాట్లాడానో అర్థమైందని చెప్పారు. తనకు ప్రభుత్వంపై.. మంత్రులందరిపై అపారమైన గౌరవం ఉందని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై సీరియస్ గా ఉన్న పలువురు కేబినెట్ మంత్రులు మధుస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆడియో క్లిప్‌లో మంత్రి ఏమన్నారంటే?
చెన్నపట్నానికి చెందిన సామాజిక కార్యకర్త భాస్కర్ తో మధుస్వామి శనివారం ఫోన్‌లో మాట్లాడారు. అందులో సహకార బ్యాంకుపై అతను చేసిన ఫిర్యాదులపై మధుస్వామి స్పందిస్తూ "మేము ఇక్కడ ప్రభుత్వాన్ని నడపడం లేదు.. మేనేజ్ చేస్తున్నామంతే. రాబోయే ఏడెనిమిది నెలల వరకు మేనేజ్ చేస్తాం " అని అన్నారు.