పత్తిరైతు గోస పట్టని ప్రభుత్వాలు : కవిత

పత్తిరైతు గోస పట్టని ప్రభుత్వాలు : కవిత
  • 20 శాతం మించి తేమ ఉన్నా కొనుగోలు చేయాలి: కవిత
  • కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలున్నా ప్రయోజనం లేదని విమర్శ 
  • ఆదిలాబాద్ లో ‘జాగృతి జనం బాట’ కార్యక్రమం

ఆదిలాబాద్, వెలుగు: పత్తి రైతులు గోసపడుతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె ఆదిలాబాద్ లో పర్యటించారు. కుమ్రం భీమ్ విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అక్కడి నుంచి ఆదిలాబాద్ పత్తి మార్కెట్ యార్డుకు వెళ్లారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ తేమ శాతం పేరుతో పత్తి కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెట్టడం సరైంది కాదని, వ్యాపారులు కొర్రీలు పెట్టి ధరలు తగ్గిస్తూ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

 తేమ శాతం 20 కంటే ఎక్కువ ఉన్నా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి రైతుల బాధ చూస్తే కడుపు తరుక్కుపోతున్నదన్నారు. వెంటనే సీసీఐ నిబంధనలు మార్చాలన్నారు. రాష్ట్రంలో నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్లు మాట్లాడితే కేంద్రం ఒప్పుకోదా అని ప్రశ్నించారు. జిల్లాలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలున్నా రైతులకు మద్దతు ధర ఇప్పించలేకపోతున్నారని విమర్శించారు. తర్వాత పత్తి రైతుల సమస్యపై ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాతో ఆమె ఫోన్ లో మాట్లాడి తన పరిధిలో ఉన్న మేరకు పత్తి రైతులకు మేలు చేయాలని కోరారు. 

నిపుణులువద్దన్నరనే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు.. 

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు సరికాదని నిపుణులు చెప్పారని, అందుకే మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చామని కవిత అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన మంచిని.. చెడును రెండింటి గురించి తాను మాట్లాడతానన్నారు. జైనథ్ మండలంలోని చనాఖా-–కోర్టా ప్రాజెక్టును కవిత సందర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టు 90 శాతం పూర్తైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మిగిలిన10 శాతం పనులు కూడా చేయడం లేదన్నారు. అనంతరం పొలంలో పత్తి ఏరుతున్న కూలీలతో మాట్లాడి వారితో కలిసి కొద్దిసేపు పత్తి తీశారు. జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. బోరజ్ మండలంలో వానలకు కొట్టుకుపోయిన తర్నం బ్రిడ్జిని పరిశీలించి.. వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.