ఇయ్యాల (సెప్టెంబర్15న) సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్

ఇయ్యాల (సెప్టెంబర్15న) సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్

 

  • ఇయ్యాల విచారణకు హాజరుకావాలన్న ఈడీ
  • ఇటీవల అప్రూవర్లుగా మారిన సౌత్ గ్రూప్ మెంబర్లు
  • బుచ్చిబాబు, ఎంపీ మాగుంట, పిళ్లై 
  • స్టేట్‌‌మెంట్లతోనే కవితకు నోటీసులు!
  • ఆమెను గతంలోనే మూడుసార్లు 
  • ప్రశ్నించిన ఈడీ అధికారులు
  • తాను అప్రూవర్​గా మారలేదని పిళ్లై ప్రకటన

ఢిల్లీ లిక్కర్ స్కామ్​కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి పిలుపు అందింది. శుక్రవారం తమ ముందు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌‌లోని కవిత ఇంటికి నోటీసులు పంపగా, మెయిల్ ద్వారా మరో సెట్ నోటీసులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు అప్రూవర్లుగా మారారు. ఈ నేపథ్యంలో విచారణకు రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

నాలుగో సారి

లిక్కర్‌‌‌‌ స్కామ్‌‌ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మూడు సార్లు ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. గతేడాది డిసెంబర్ 11న తొలిసారి కవితను హైదరాబాద్‌‌లోని ఆమె నివాసంలో సీబీఐ విచారించింది. సీఆర్‌‌‌‌పీసీ 160 ప్రకారం సాక్షిగా కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసింది. నాలుగు నెలల తర్వాత ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ఆమెకు ఈడీ నోటీసులు ఇచ్చింది. తొలిసారి మార్చి 11న ఢిల్లీలో ఈడీ అధికారుల ముందు కవిత హాజరయ్యారు. తర్వాత 16న హాజరుకావాలని నోటీసులు ఇవ్వగా.. తనను ఇంటి వద్దే విచారించాలంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు రానుందంటూ 16వ తేదీన విచారణకు కవిత వెళ్లలేదు. తర్వాత 20వ తేదీన తమముందు హాజరుకావాలని ఈడీ అధికారులు సమన్లు పంపారు. 20వ తేదీ విచారించిన తర్వాత.. 21న హాజరుకావాలని చెప్పి ఆ రోజు కూడా ప్రశ్నించారు. ఇలా ఈ కేసులో మూడు సార్లు విచారణకు కవిత హాజరయ్యారు. తొలి సారి (11న) సుమారు 8 గంటలు, రెండో సారి(20వ తేదీ) సుమారు 10 గంటలు, మూడో సారి (21వ తేదీ) సుమారు 10 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 50 కింద స్టేట్ మెంట్‌ను రికార్డు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం, సౌత్ గ్రూపు ఏర్పాటు, సాత్ గ్రూప్ - ఆప్ మధ్య జరిగిన వ్యవహారాలు, ఒప్పందాలు, సౌత్ గ్రూపులో కవిత పాత్ర, పెట్టిన పెట్టుబడులు, ముడుపులుగా ఇచ్చిన డబ్బులు, స్కాంలో భాగస్వాములైన నిందితులతో జరిపిన సమావేశాల గురించి ప్రశ్నంచి.. కవిత ఇచ్చిన సమాధానాలతో రూపొందించిన పత్రాలపై ఆమె సంతకాలు తీసుకున్నారు. కవిత సమర్పించిన తన బ్యాంకు ఖాతాలు, వ్యాపార లావాదేవీల నివేదికలు, 11 ఫోన్లను పరిశీలించారు. 

కీలక సమాచారం ఆధారంగా పిలుపు

లిక్కర్ స్కాంలో ఆరు నెలలుగా పైకి సైలెంట్‌గా కనిపించిన దర్యాప్తు సంస్థలు.. తెరవెనక దర్యాప్తును కొనసాగించాయి. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వారి నుంచి సమాచారాన్ని సేకరిస్తూ వచ్చాయి. తొలుత సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిన శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయిన పల్లి, అరుణ్ పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు, మాగుంట రాఘవలను అదుపులోకి తీసుకొని కీలక విషయాలను రాబట్టాయి. ఈ సమాచారం తర్వాత సీబీఐ, ఈడీ చార్జ్ షీట్లను దాఖలు చేశాయి. వాటి ఆధారంగానే కవితను విచారించాయి. గత నెల రోజులుగా లిక్కర్ స్కాం మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఒక్కొక్కరినీ విచారణకు పిలుస్తూ కీలక సమాచారాన్ని రాబట్టింది. ఇప్పటి వరకు సేకరించిన డేటా ఆధారంగా అసలు పాత్రధారి ఎవరో కనిపెట్టే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలోనే శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు అప్రూవర్లుగా మారారు. కీలక వ్యక్తులు, తెరవెనక పాత్రలు, లిక్కర్ పాలసీ రూపకల్పన లో మాస్టర్ మైండ్లు తదితర అంశాలపై అన్ని విషయాలను స్టేట్‌మెంట్ల రూపంలో ఈడీ నమోదు చేసింది. ఈ వాంగ్మూలాల ఆధారంగానే కవితకు తాజాగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

కవితనే అసలైన ఇన్వెస్టర్!

ఢిల్లీ లిక్కర్ స్కామ్​కు సంబంధించి ఇండోస్పిరిట్ వాటాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనే అసలైన ఇన్వెస్టర్ అని అరుణ్ పిళ్లై అంగీకరించినట్లు గతంలో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్‌లో ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్ (ఎల్ 1) షాపులో కవితకు బినామీగా వ్యవహరించినట్లు అరుణ్ పిళ్లై అంగీకరించారని చెప్పింది. ఈ చార్జ్ షీట్ లో దాదాపు 53 సార్లు కవిత పేరును ప్రస్తావించింది. సౌత్ గ్రూప్‌లో ఆమె పాత్ర, నిందితులు అరుణ్ రామ చంద్ర పిళ్లై, బుచ్చిబాబు, సమీర్ మహేంద్రు, మాగుంట రాఘవ, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, దినేశ్‌ అరోరాలతో ఉన్న పరిచయాలను వారి స్టేట్‌మెంట్ల రూపంలో పేర్కొంది. గతేడాది నవంబర్ 11న పిళ్లై ఇచ్చిన వాంగ్మూలంలో తాను కవితకు బదులు పార్ట్‌నర్‌‌గా వ్యవహరించానని ఒప్పుకున్నట్లు పేర్కొంది.

ఇప్పటి వరకు అరెస్ట్ అయింది వీళ్లే

లిక్కర్ స్కామ్​ కేసులో ఇప్పటిదాకా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ విజయ్ నాయర్, లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రు, సౌత్ గ్రూప్ నుంచి శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బినోయ్ బాబు, బుచ్చిబాబు, మాగుంట రాఘవ రెడ్డి, అరుణ్ పిళ్లై, అమన్ దీప్ ధాల్, దినేశ్ అరోరా, ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు, ఇతరులను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. వీరిలో సగం మంది తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ ముందు అప్రూవర్లుగా మారిన శరత్ చంద్రా రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి, బుచ్చిబాబు, పలువురు ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చారు.

కీలక ఎవిడెన్సులుగా ఫోన్లు

గత విచారణ సందర్భంగా ఈడీకి కవిత అప్పగించిన ఫోన్ల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు సమాచారం సేకరించినట్లు తెలిసింది. గతేడాది నవంబర్ 25న సీబీఐ, 26న ఈడీ వేసిన చార్జ్ షీట్లు, ఈ ఏడాది జనవరి 6న ఈడీ వేసిన సప్లిమెంటరీ చార్జ్​షీట్​లోనూ 36 మంది నిందితులు/అనుమానితులు 170 ఫోన్లను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాయి. ఇందులో 17 ఫోన్లు మాత్రమే రికవరీ అయినట్లు వెల్లడించాయి. 2022 మే నుంచి ఆగస్టు మధ్యలో లిక్కర్ పాలసీ అమలులోకి వచ్చిన తర్వాతనే నిందితులు అధికంగా ఫోన్లు మార్చారని ఈడీ పేర్కొంది. కవిత రెండు నంబర్లతో 10 ఫోన్లు మార్చినట్లు తెలిపింది. ఐఎంఈఐ డేటా ప్రకారం 2021లో మూడు ఫోన్లు, 2022 లో 7 ఫోన్లు మార్చినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలోనే తన ఫోన్లను కవిత గత విచారణ సందర్భంగా ఈడీకి సమర్పించారు. దర్యాప్తులో ఈ ఫోన్లు కీలక ఎవిడెన్సులుగా మారినట్లు తెలిసింది.

ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం, కవితల మధ్య అవగాహన: ఈడీ

లిక్కర్ వ్యాపారంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య అవగాహన ఉందని కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. విజయ్ నాయర్ పాలసీ రూపకల్పనలో చేయాల్సిన మార్పుల వివరాలను ‘సిగ్నల్’లో బుచ్చిబాబుకు పంపినట్లు తెలిపింది. ఈ స్కాంలో బుచ్చిబాబు సౌత్ గ్రూప్‌నకు ప్రతినిధిగా వ్యవహరించినట్లు ఆరోపించింది. వీరితో పాటూ లిక్కర్ పాలసీతో సంబంధం ఉన్న మొత్తం 51 మంది ఇచ్చిన స్టేట్‌మెంట్లను చార్జ్ షీట్ లో ప్రస్తావించింది. ఇందులో నిందితుల పాత్ర, వారి తరపున తెరవెనక వ్యవహారం నడిపించిన వారి వివరాలను ప్రత్యేకంగా పేర్కొంది. అగ్రిమెంట్ లో భాగంగా సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేత విజయ్ నాయర్ కు రూ.100 కోట్లు చేరాయని ఈడీ ఆరోపిస్తున్నది. ఈ సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ, శరత్ చంద్రా రెడ్డి లు ఉన్నట్లు చెబుతున్నది. ఎంపీ శ్రీనివాసులురెడ్డి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారని, ఈ సందర్భంగా సీఎం లిక్కర్ బిజినెస్ లోకి సౌత్ గ్రూప్ కు వెల్ కమ్ చెప్పినట్లు ఆరోపించింది.

ఇయ్యాల సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్

న్యూఢిల్లీ, వెలుగు : మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంటి వద్దే విచారించాలంటూ లిక్కర్ స్కాం కేసు వ్యవహారంలో కవిత వేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వచ్చే అవకాశం ఉంది. జడ్జిలు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు, జస్టిస్ అరవింద్ కుమార్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. గురువారం సుప్రీంకోర్టు కేసుల విచారణ జాబితాలో కవిత పిటిషన్‌ను పొందుపరిచింది. వెస్ట్ బెంగాల్ సీఎం మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వర్సెస్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పిటిషన్‌తో కవిత వేసిన పిటిషన్ అటాచ్ అయి ఉంది.