తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్తమాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. తిరుమలలోని కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తెలియక దోషాలు జరిగి ఉంటే ఆ దోష నివారణకు బ్రహ్మోత్సవాల తర్వాత ప్రతి కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి టీటీడీ పునరుద్ధరించి నిర్వహిస్తుందన్నారు. శ్రీవారి ఆలయంలో గురువారం ( అక్టోబర్ 30) ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం జరిగింది. మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు.
ఇందుకోసం 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తామని చెప్పారు. తమిళనాడు నుంచి ఐదు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుండి రెండు టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని టీటీడీ అధికారులు తెలిపారు.
