కొట్టుకుపోయిన హైదరాబాద్ - శ్రీశైలం హైవే..వాహనదారులు ఎలా వెళ్లాలంటే.?

కొట్టుకుపోయిన హైదరాబాద్ - శ్రీశైలం హైవే..వాహనదారులు ఎలా వెళ్లాలంటే.?

మొంథా ఎఫెక్ట్ తో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.  అతి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ -శ్రీశైలం ప్రధాన రహదారిపై కల్వకుర్తి, అచ్చంపేట మధ్య ఉన్న డిండి ప్రాజెక్ట్‌ అలుగు ప్రమాదకరంగా పారుతోంది. వరద ధాటికి  లత్తీపూర్ దగ్గర  బ్రిడ్జి కొట్టుకుపోయింది. అప్రమత్తమైన ఆఫీసర్లు రాకపోకలను నిలిపివేసి వాహనాలను దారి మళ్లించారు.  శ్రీశైలం నుంచి వస్తున్న వాహనదారులు హాజీపూర్ సమీపంలో నిలిచిపోవాల్సి వస్తోంది. అదే విధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు డిండి దగ్గర ఆగాల్సి వచ్చింది. 

ఈ రూట్లలో  వెళ్లండి

శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు అచ్చంపేట, బల్మూర్, లింగాల, తెల్కపల్లి, నాగర్ కర్నూల్ దారిని వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. అచ్చంపేట- తెల్కపల్లి మధ్య తుమ్మన్ పేట చెరువు తెగడంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయినందున అచ్చంపేట నుంచి బల్మూరు మీదుగా వెళ్లాల్సిందిగా సూచించారు. 

కొందరు వాహనదారులు హాజీపూర్ నుంచి చింతపల్లి, కొండారెడ్డి పల్లి మీదుగా కల్వకుర్తి దగ్గరలో హైవేకు కలుస్తున్నారు. కానీ వర్షం కారణంగా ఆ రూట్ అంత సేఫ్ కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.